సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

-రెగ్యులర్‌గా చదువుకోలేని వారికి ఓపెన్ స్కూల్ విధానం
-విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
-ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ విడుదల
-అక్టోబర్ 1 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

Jagadish Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా పెట్టుకున్నారని విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఓపెన్ స్కూల్ విద్యావిధానం ఎంతగానో ఉపయోగపడుతుందని, రెగ్యులర్ విధానంలో చదువుకోలేనివారు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఉన్నత చదువులు చదువుకోవచ్చునని ఆయన చెప్పారు. 2014-2015 విద్యాసంవత్సరానికి ఓపెన్ స్కూల్ సొసైటీ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్‌ను జగదీశ్‌రెడ్డి గురువారం సచివాలయంలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ సొసైటీని 1991లో ప్రారంభించారని, 2008 నుంచి పదో తరగతి కోర్సులను కూడా అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 850 స్టడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు.

అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
ఈ విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్ సొసైటీ కోర్సుల కోసం అక్టోబర్ 1 నుంచి 31 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. లేటు ఫీజుతో నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఆగస్టు 31 నాటికి దరఖాస్తుదారులకు 14 ఏండ్ల వయస్సు నిండి ఉండాలని, కనీస విద్యార్హతలు అవసరం లేదన్నారు. ఇంటర్మీడియట్ కోర్సులో చేరాలనుకునేవారికి అక్టోబర్ 31 నాటికి 15 ఏండ్ల వయస్సు నిండి ఉండాలని, గుర్తింపుపొందిన బోర్డుల నుంచి ఎస్సెస్సీ ఉత్తీర్ణులై ఉండాలని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మచెప్పారు. స్టడీ కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ దరఖాస్తులు పొందవచ్చని మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.