సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై జట్టుకట్టి.. యుద్ధం చేయాలి

-2017 నుంచి రైతులకు 24 గంటలు కరెంట్
-వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ ఇవ్వకపోతే ఓట్లు అడగం
-ప్రజలపై భారం లేకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్
-2016లో ప్రయోగాత్మకంగా కేజీ టు పీజీ
-కిషన్‌రెడ్డి చాల హుషారు, ఎమ్మెల్యే అట్ల ఉండాలె
-ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో సీఎం కేసీఆర్
-నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాల జల్లు

KCR addressing in Ibrahimpatnam meeting

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, సమస్యలపై మనమే యుద్ధం చేయాలి. మనమంతా పట్టుపట్టాలి. జట్టు కట్టాలి. కుల, మత భేదాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలనే ఆసక్తితో దేశం అంతా తెలంగాణవైపే చూస్తున్నదని చెప్పారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సభలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పిన సీఎం.. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వివిధ కార్యక్రమాలకు రూ.10 కోట్లకు పైగానిధులను ఈ నియోజకవర్గానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే..

బలహీనవర్గాల ముఖాల్లో చిరునవ్వులు చిందాలి
తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో పేదల సం ఖ్య అధికంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వర్గాలకు అన్ని రకాలుగా లాభం జరగాలి. వారి ముఖాల్లో చిరునవ్వులు విరజిల్లాలి. చాలా దేశాలు పేదలకు పింఛన్లు మంజూరు చేస్తున్నాయి. చింతలేకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛన్లు ఇస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వికలాంగులకు రూ.1500 పింఛన్ మనమే ఇస్తున్నాం. హాస్టళ్ళలో సన్నబియ్యం సరఫరా చేయాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. ప్రభుత్వమే బాధ్యతాయుతంగా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా భోజనం పెడుతున్నది. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.51 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అందరు ఆరోగ్యంగా ఉంటేనే తెలంగాణ బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో అంగన్‌వాడీ సెంటర్లలో ఇచ్చే గుడ్లు, పాలు, అన్నం పరిమితిని (క్వాంటిటీని) పెంచాం.

TRS Public Meeting in Ibrahipatnam

65ఏండ్ల పాపాన్ని కడిగేస్తున్నాం
పాత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పనులన్నీ చేస్తున్నాం. అరవై ఐదు సంవత్సరాలపాటు కూడుకు పోయిన పాపాన్ని కడిగేస్తున్నాం. ఇందుకోసం రూ.20 వేల కోట్లతో మిషన్ కాకతీయను చేపట్టి.. చెరువులు పునరుద్ధరిస్తున్నాం. ఎరువుల బస్తాలకంటే చెరువు మట్టి ఎంతో మేలు. మీరంతా చెరువు మట్టిని పొలాల్లో వాడుకోవాలి.

నల్లా నీళ్లివ్వకపోతే ఓట్లడిగేది లేదు
డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌తో పరిశుభ్రమైన నీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంట్లో నల్లాకు, పైపులకు అయ్యే ఖర్చులన్నీంటినీ ప్రభుత్వమే భరిస్తుంది. వచ్చే మూడున్నర ఏండ్లలో 10 జిల్లాల్లో ప్రతి ఇంటికీ నీటిని అందిస్తాం. ఇవ్వకపోతే ఓట్లు అడగం. ఆత్మవిశ్వాసంతో కచ్చితంగా పూర్తిచేస్తాం.

 

రాష్ర్టానికి హరితహారం
మన వానలను మనమే పొగొట్టుకున్నాం. సమైక్య పాలనలో టేకు చెట్లు, అడవులు నాశనమైపోయయి. దీంతో కోతుల బెడద ఎదుర్కొంటున్నాం. కోతుల జాగాలను మనం పాడు చేశాం కాబట్టే మన దగ్గరకి కోతులు వస్తున్నాయి. మనం చేసిన తప్పులకు మనమే అనుభవిస్తున్నాం. అడవులు అంతరించడం వల్లే వానలు బంద్ అయ్యాయి. వచ్చే జూలైలో హరితహారం చేపడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలి. ప్రతి గామానికి 40 వేల మొక్కలు సరఫరా అవుతాయి. మీరు ఒక్క రూపాయి ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మొక్కలన్నీ ఉచితంగా మీ వద్దకే సరఫరా చేస్తాం. వాటిని నాటి పెంచాల్సిన బాధ్యత మీది. తెలంగాణలో ప్రతి పనికి జిద్దు ఉండాలి. చైనాలో గోబీ ఎడారి విస్తరించకుండా 500 కోట్ల మొక్కలను నాటారు.

ఆగమైతదన్నోళ్లే ఆగమయ్యారు
తెలంగాణ వస్తే ఆగమైపోతరన్నోడు.. వాడే ఆగమైపోయాడు! ఆంధ్రా ముఖ్యమంత్రులు, నాయకులు, సమైక్యవాదులు ఏం మాట్లాడారు? తెలంగాణ వస్తే కరెంట్ రాదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగమైపోతరన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? వచ్చే మార్చి నుంచి రైతులకు పగటి పూట నిరాటంకంగా కరెంట్ సరఫరా ఉంటుంది. 2017 మార్చి నుంచి రైతులకు 24 గంటలు త్రీఫేస్ కరెంట్ సరఫరా చేస్తాం. రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇవ్వకపోతే టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లే అడగదు.

కోతులు వాపస్ పోవాలె.. వానలు వాపస్ రావాలె
నాయకులకు బరువు, బాధ్యత ఉండాలి. ఉంటేనే బాగా పనిచేస్తరు. మునుముందు కడుపునిండా మంచినీళ్ళు, పుష్కలంగా కరెంట్ ఇచ్చి తీరుతం. నేను ఒట్టి మాటలు చెప్ప. తలకాయ తెగనన్న తెగాలి.. మాట నిలువనన్న నిలువాలి. మనం పట్టుపట్టాలే, జతకట్టాలే, కోతులు వాపస్‌పోవాలే, వానలు వాపస్‌రావాలే. అంతా మన చేతుల్లోనే ఉంది. మనమే దేవుళ్ళం.

డ్వాక్రా మహిళలకు మరింత చేయూత
ఐకేపీ డ్వాక్రా మహిళలు చాలా మంచిగా పనిచేస్తున్నరు. లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నరు. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పొందుతున్నరు. ఇకపై రూ.10 లక్షలవరకు వడ్డీ లేని రుణాలు అందజేసే బాధ్యత మాది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.

పనిచేసే తపన ఉండాలె
కిషన్‌రెడ్డి చాల హుషారు. ఎమ్మెల్యే అట్లా ఉంటేనే మంచిది. పనిచేసే తపన ఎమ్మెల్యేలకు ఉండాలి. ఇక్కడి పంట పొలాలకు నీరు రావాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం రూపకల్పన జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం, మంచాలలో లక్ష ఎకరాలకు నీరు రాబోతున్నది. దానిని మూడు, నాలుగు ఏండ్లలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట నిలబెడతాం. ఈ ఒక్క నియోజకవర్గానికి రూ.10 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నాం. మరో 24 గంటల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రతి మండల కేంద్రాల అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తాం. ఇంత కాలం మన సొమ్ము ఆంధ్రాకు తరలిపోయింది. ఇప్పుడు మన డబ్బుతో మనమే మంచి పనులు చేసుకుంటున్నాం. ఇబ్రహీంపట్నం చెరువును నింపే ప్రయత్నం చేస్తాం.

వచ్చే ఏడాది నుంచి కేజీ టూ పీజీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. ఇబ్రహీంపట్నంకు రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్ళు మంజూరు చేస్తాం అని సీఎం చెప్పారు. ఈ బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బహిరంగ సభ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ, ఇతర పార్టీలనుంచి దాదాపు 70మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జనం భారీ సంఖ్యలో సభకు తరలి రావడంతో ఇబ్రహీంపట్నంతో పాటు పరిసర ప్రాంతాలు గులాబీమయంగా మారాయి.