సమగ్రాభివృద్ధికే డాటాబేస్

-కొత్త రాష్ట్రంలో సరికొత్త ప్రణాళికలు
-మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు
-పాలనలో పారదర్శకత మా లక్ష్యం
-15ఏండ్లలో 200 కి.మీ.మేర మెట్రోరైల్

KTR

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు వినూత్నంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాల్లో ఒకేరోజు 3.6 కోట్ల జనాభాను భాగస్వాములను చేస్తూ సర్వే నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సర్వే నివేదిక ఆధారంగానే చేపట్టనున్నట్లు చెప్పారు.

పారదర్శకతను పెంపొందిస్తూ మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం రీడిఫైనింగ్ అర్బన్ ఎజెండా: బిగ్ డేటా-బిగ్ ఐడియాస్-బిగ్ చాలెంజెస్ అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తమది కొత్త యువ రాష్ట్రమైనందున, ఇక్కడి ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్‌సిటీగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించినట్లు చెప్పారు.

ఈ దిశగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఆ డాటా ఆధారంగానే సక్రమమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన సాధ్యమని చెప్పారు. అప్పుడు ఫలితాలు అర్హులకే లభించే వీలు కలుగుతుందన్నారు. సమగ్ర డాటా రూపొందించడం ఒక భాగమైతే.. దాన్ని ఎంత ప్రభావవంతంగా ఉపయోగిస్తామనేది అత్యంత ప్రధానమని చెప్పారు. సర్వే నుంచి పొందిన డాటా ఆధారంగా వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుపుతామని తెలిపారు.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు : స్మార్ట్‌సిటీలపై ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తాత్పర్యం చెబుతున్నారన్న కేటీఆర్.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరికివారు దీనికి అనువైన విధానాలు రూపొందించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌సిటీస్‌కోసం ఒక దేశంలో, ఒక నగర విధానాలు మరో దేశంలో, మరో నగరానికి వర్తించబోవన్నారు. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఓ ఫార్ములాను రూపొంచాల్సి ఉంటుందన్నారు.

డాటాబేస్ అందుబాటులో ఉంటుంది
సమగ్ర కుటుంబ సర్వే డాటాబేస్‌లో ఎటువంటి గోప్యత లేదని మంత్రి స్పష్టం చేశారు. సమాచారాన్ని రాబట్టేందుకు సమాచార హక్కు చట్టం వంటి ప్రభావవంతమైన చట్టాలున్నాయని ఓ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజారవాణాపై మరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, 2017నాటికి 72కిలోమీటర్ల మేరకు మెట్రోరైలు ప్రాజెక్ట్ అందుబాటులోకొస్తుందని, వచ్చే 15ఏండ్లలో దాన్ని 200కిలోమీటర్లకు విస్తరిస్తామని వివరించారు.

నగరంలో సంబంధాలకు అవకాశం: జేవియర్ ట్రియాస్
బార్సిలోనా మేయర్ జేవియర్ ట్రియాస్ మాట్లాడుతూ, నగరాల్లో సమస్యల పరిష్కారానికి మెట్రోపొలిస్ నిరంతరం కృషిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌కు తాను మొదటిసారి వచ్చానన్న ట్రియాస్.. నగరంతో అనేకరంగాల్లో తాము సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ప్రత్యేక కమిషనర్ అహ్మద్‌బాబు, ఉడ్రోవిల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ గ్లోబల్ ఫెలో టిమ్ క్యాంబెల్ తదితరులు ఈ అంశంపై ప్రసంగించారు.

శాఖల సమన్వయంతోనే మెరుగైన సేవలు
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం డిజిటల్ తెలంగాణను, డిజిటల్ హైదరాబాద్‌ను రూపొందించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. పట్టణాల నిర్వహణ ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉందని చెప్పారు. ముఖ్యంగా ఆదాయ సమీకరణ ఇందులో ప్రధానమని అన్నారు. పట్టణ ప్రణాళికలు క్రమపద్ధతిలో సాగాలని చెప్పారు. డాటాబేస్ ఇందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామం కూడా ఎంతో ప్రధానమని కేటీఆర్ నొక్కి చెప్పారు. వచ్చే 20ఏండ్లలో పెరిగే అవసరాలు, జనాభాకు అనుగుణంగా నగరాన్ని సిద్ధం చేసేందుకు ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.