సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ప్రాధాన్యం

-సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీలు,టాస్క్‌ఫోర్స్‌లు
-ప్రాణహిత-చేవెళ్ల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
-టీ మీడియాతో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయటానికి నిపుణుల కమిటీలను, టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు భారీనీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అక్రమంగా నీరు తరలించుకుపోవటం, పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రకు బదలాయించటంపై సుప్రీంకోర్డుకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభా సమావేశాలు ముగిసిన వెంటనే ప్రాజెక్ట్‌ల దశ, దిశను నిర్దేశించటానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ర్టాలతో నీటి వాటాల పంపిణీ, రిజర్వాయర్ల నిర్మాణంపై ఆయన శుక్రవారం టీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

టీ మీడియా: నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధానాంశాల ఆధారంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మీరు అధికారంలోకి వచ్చారు. కీలకమైన నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఎలా ఫీలవుతున్నారు..?
హరీశ్: ఆకలివేసిన వానికే అన్నం విలువ తెలుస్తుంది. ప్రజల గోసను, కష్టాన్ని అర్థం చేసుకొని, వారి సమస్యలను తీర్చగలిగే శక్తి మాకు ఉద్యమం ద్వారా మాకు వచ్చింది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలోని సర్కార్ ఏలుబడిలో బీడులుగా మారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాల్సిన గురుతర బాధ్యత నాపై ఉంది. దానికోసం శ్రమిస్తా.

టీ మీడియా: ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని మీరు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిజం చేయగలుగుతారా..?
హరీశ్: తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే అందులో హైదరాబాద్‌తోపాటు పట్టణ ప్రాంతాలను తీసేస్తే సుమారు 70 నియోజకవర్గాలలో సాగునీరందించాల్సి ఉంది. గత పాలకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడటం వల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదు. రికార్డులపైన మాత్రమే ప్రాజెక్టులు 90 శాతం పూర్తయినట్లు చూపిస్తారు. కానీ, నాలుగు శాతం ఆయకట్టుకూడా నీరు పారడంలేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు.

టీ మీడియా: సాగునీటి ప్రాజెక్టులలో మీ ప్రాధాన్యక్రమం ఏ విధంగా ఉండబోతున్నది..?
హరీశ్: గిరిజనులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, వలసల జిల్లాగా పేరుపడిన మహబూబ్‌నగర్‌కు మొదటి ప్రాధాన్యమిస్తాం. కొద్దిగా కష్టపడితే ఎక్కువ ఫలితాలొచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాను. కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, డిండి, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టులను పూర్తిగా వినియోగంలోనికి తెస్తాం.

టీ మీడియా: ప్రాజెక్టులు పూర్తికావడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా, చట్టపరంగా వచ్చే అడ్డంకులను తొలగించడానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఏమైనా ఉందా..?
హరీశ్: కచ్చితంగా. ప్రాజెక్టుల క్లియరెన్సు, పర్యావరణ అనుమతులు, ఇతర విషయాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేస్తున్నాం. న్యాయపరంగా వాదనలను వినిపించడానికి లీగల్ టీంను ప్రాజెక్టుల పూర్తి కోసం నిపుణుల కమిటీని, జిల్లాకో టాస్క్‌ఫోర్స్ కమిటీని వేయనున్నాం.

టీ మీడియా: కృష్ణా బేసిన్ అవతల ఉన్న అక్రమ ప్రాజెక్ట్‌లకు కూడా పునర్వ్యవస్థీకరణ బిల్లులో గుర్తింపునిచ్చారు. దీని వల్ల తెలంగాణ నీటికి గండి పడుతుందనే ఆందోళన ఉందికదా?
హరీశ్: కృష్ణా బేసిన్‌లో లేని అక్రమ ప్రాజెక్ట్‌లకు నీటిని మళ్లించే విషయంలో న్యాయపోరాటం చేస్తాం. తెలంగాణ వాటాకు గండికొడితే సహించం. పోతిరెడ్డిపాడు, పోలవరం ప్రాజెక్టులపై సుప్రీంకు వెళతాం.

టీ మీడియా: ఇటీవల 16 ప్రాజెక్ట్‌లను షెడ్యూల్ 11లో కలుపుతూ రివర్‌బోర్డుల పరిధిలోకి తెచ్చారు. అందులో కొన్ని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని చెబుతున్నారు..!
హరీశ్: దీనిపై పరిశీలన జరుపుతున్నాం. దమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనిపై హైలెవల్ కమిటీలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.