సాగర్ కాల్వపై సంకల్ప యాత్ర!

-రెండ్రోజులు, రెండు జిల్లాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటన
-243 కిలోమీటర్లు అడుగడుగునా ఎడమ కాల్వ పరిశీలన
-రైతులతో మమేకం.. నాణ్యతా లోపాలపై ఆగ్రహం
-వర్షాలతో కాల్వకట్టలు దెబ్బతిన్నా ఆగని యాత్ర
-రెండ్రోజులూ కాల్వ మీదనే మధ్యాహ్న భోజనం
-హరీశ్‌తోపాటే మంత్రులు తుమ్మల, జగదీశ్‌రెడ్డి

Harish Rao inspects Nagarjunasagar ayacut

వరుసగా కురుస్తున్న వర్షాలతో కాల్వ కట్టలు దెబ్బతిని బురద కారణంగా వాహనాలు జారే ప్రమాదం! అయినా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వెంట నిర్మానుష్య ప్రాంతంలో 243 కిలోమీటర్ల దూరం అలుపెరగని ప్రయాణం! కాల్వ ఆధునీకరణ పనులను స్వయంగా పర్యవేక్షించాలన్న సంకల్పం! చుక్కనీరు కూడా వృథా కాకుండా చూడాలన్న తాపత్రయం! ఆధునీకరణ వేగంగా, నాణ్యంగా చేయించి చివరి ఎకరానికీ నీరందించాలన్న ఆశయం! ఒక వైపు అధికార యంత్రాంగం వద్దని వారిస్తున్నా.. మరోవైపు పోలీసులు వద్దని హెచ్చరించినా.. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన కాల్వల దుస్థితిని కళ్లారా చూడాలనే సంకల్పం! తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నా కాల్వ గట్లపైనే మధ్నాహ్న భోజనం..ఇదీ మంత్రి హరీశ్‌రావు సాహసం! సోమ, మంగళవారాల్లో నిర్విరామంగా ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతిచోటా పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. అవసరమైన సలహాలిస్తూ.. నాణ్యత లోపించిన చోట ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి వెంటరాగా హరీశ్‌రావు ముందుకు సాగారు. సోమవారం నల్లగొండలో 133 కిలోమీటర్ల దూరం కాల్వ వెంటే సాగగా.. రెండో రోజు ఖమ్మం జిల్లాలో మరో 110 కిలోమీటర్లు 48 గంటలపాటు దిగ్విజయంగా సాహసయాత్ర కొనసాగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి 60 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఏ మంత్రి చేయని సాహసాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రదర్శించారు. సాగర్ ఎడమ కాల్వల వెంట పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పరిశీలించారు.

కాల్వ కట్టలపై ప్రమాదపుటంచుల్లోనే ప్రయాణం
నాగార్జునసాగర్ ఎడమకాల్వ, ఆధునీకరణ పనులను రెండ్రోజులు సుదీర్ఘంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. తన బృందంతో పూర్తిగా కాల్వ కట్టలపైనే ప్రయాణించారు. ఆదివారం రాత్రే హరీశ్‌తోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అదే రాత్రి నల్లగొండ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా 29.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఎడమ కాల్వ ముందుకు సాగే ఆయకట్టు ప్రాంతంలోనూ భారీ వర్షం కురవడంతో.. కట్టలు పూర్తిగా తడిశాయి. కాల్వ ఆసాంతం కట్ట మీదనే ప్రయాణం క్షేమకరం కాకపోయినా యాత్ర ఆపలేదు. సోమవారం ఉదయం నాగార్జునసాగర్‌లో సమీక్షతో మొదలు పెట్టి.. సాయంత్రం 6.30 గంటలకు మునగాల మండలంలో నల్లగొండ జిల్లా యాత్ర ముగించారు. మొత్తం 133.56 కిలోమీటర్ల దూరం కాల్వ కట్టలపైనే ప్రయాణించారు. రెండో రోజు ఖమ్మం జిల్లాలో ఉదయం 8గంటలకు పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించి అనంతరం సత్తుపల్లి మండలంలోని ఎన్టీఆర్ కెనాల్ వరకు 110 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. ఈక్రమంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్‌ను, మేజర్లు, మైనర్ల ఆధునీకరణ పనులను పరిశీలించారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది.

చివరి ఆయకట్టుకూ నీరిస్తామని రైతులకు భరోసా
ఆయకట్టులోని చివరి భూములకు నీరందివ్వడం.. చుక్కనీరూ వృథా కాకూడదనే ఆశయం.. పనుల్లో నాణ్యతను పరిశీలించడమే ప్రధాన లక్ష్యంగా యాత్ర చేపట్టిన మంత్రి.. తన పర్యటనలో అడుగడుగునా రైతులతో మమేకమయ్యారు. అన్నదాతలు లేవెనెత్తిన సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారాలు చూపారు. మరికొన్ని చోట్ల అధికారుల తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా లోపాలపై మండిపడ్డారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.