సేఫ్ సిటీపై సీఎం నజర్

-ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి
-క్రైమ్ కంట్రోల్‌కు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ అధికారులకు ఆదేశం
-పటిష్ఠ భద్రత వ్యవస్థకు ఏర్పాట్లు
-లండన్ సెక్యూరిటీ సిస్టమ్‌పై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్
-టెక్నాలజీని అందిపుచ్చుకుంటే బెస్ట్ సిటీగా నిలుస్తామన్న సీఎం కేసీఆర్

KCR 01
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలో బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై పోలీస్ ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులతో బుధవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నగరంలో పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సెక్యూరిటీ అండ్ సేఫ్ సిటీగా హైదరాబాద్ నిలుస్తుందని ఆకాంక్షించారు.

ప్రపంచంలోని వివిధ నగరాల్లో అమల్లో ఉన్న భద్రత వ్యవస్థపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. జీఎంఆర్ ప్రతినిధులు సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై సీఎంకు వివరించారు. లండన్ తరహా భద్రత వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరం జరిగిన వెంటనే క్షణాల్లో సమాచారం తెలుసుకోవడం, ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి తెలియజేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్ట్‌ను జీఎంఆర్ ప్రతినిధులు కేసీఆర్‌కు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నగరంలో భద్రత, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రతిపాదనలను కూడా సీఎంకు జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు.

పటిష్ఠ నిఘా.. నేరాల నియంత్రణ..
హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు, సెన్సర్లు, అలారం సిస్టమ్, డాటా స్టోరేజీ అండ్ వీడియో అనాలటిక్స్ సిస్టమ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థల ఏర్పాటుపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రపంచంలో ది బెస్ట్ సిటీల్లో అమల్లో ఉన్న వ్యవస్థను అధ్యయనం చేసి హైదరాబాద్‌కు అవరసమైన భద్రత ఏర్పాట్లను రూపొందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నగరం మొత్తం ప్రతీ క్షణం వీక్షించేలా నిఘా వ్యవస్థను పటిష్ఠపరుచాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింతగా ఆధునీకరించాలని సూచించారు.

వివిధ ప్రైవేట్, ప్రభుత్వ, కాలనీవాసులు కూడా భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, వాటిని కూడా పోలీస్ భద్రత వ్యవస్థతో అనుసంధానం చేసుకోవాలన్నారు. నగరం త్వరలోనే 4జీ కనెక్టివిటీ నగరంగా మారుతుందని, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకొని హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అజయ్‌మిశ్రా, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, జీఎంఆర్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు, ప్రెసిడెంట్ సీ ప్రసన్న, యూకే కన్సల్టెంట్ డాన్ రాండల్, రక్ష సీఈఓ సీవీ రావ్, ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ పాల్గొన్నారు.

22 న కేసీఆర్ ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఈనెల 22న ఇఫ్తార్ విందును ఇవ్వనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ విందు ఉంటుంది.