శబ్ద శాసనుడు మా సినారె

– తెలంగాణ ముద్దుబిడ్డల్లో ప్రథముడు
– ఆయన గ్రంథం మీద వ్యాసంతో బహుమతి గెలిచా
– సినారె 84వ జన్మదిన వేడుకల్లో సీఎం కేసీఆర్KCR-001

తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సీ నారాయణరెడ్డి శబ్ద శాసనుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. తెలంగాణ ముద్దుబిడ్డల్లో ఆయనే ప్రథముడని కొనియాడారు. గళంలో పదాలతో నాట్యం చేయించిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు. ఒకనాడు ఆయన రచన మీద వ్యాసం రాసి మొదటి బహుమతి గెలుచుకున్నానని కేసీఆర్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన వంటి పాటలు రాయడం మరొకరికి సాధ్యం కాదన్నారు. అందుకే ఏ పురస్కారమైనా ఆయనను దాటి అడుగు ముందుకు వేయలేదని కొనియాడారు. అలాంటి సినారే తెలంగాణ వాడు.. మావాడు అంటూ ఈ గడ్డ గర్విస్తుందన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో సినారె 84వ జన్మదినం సందర్భంగా ఆయన రాసిన నింగికెగిరిన చెట్లు గ్రంధాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కేవీ రమణాచారి సభకు అధ్యక్షత వహించగా ఆవిష్కరణ తొలి సంపుటిని అమెరికన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినారె రచించిన కవితా సంపుటి నింగికెగిరిన చెట్లు గ్రంథావిష్కరణ చేయటం తన ఆదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బాల్యం నుంచి డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో చదువుకుని ఎంఏలో తెలుగు సాహిత్యం చేయటం అంటే ఎంతో సాహసంతో కూడుకున్న పని అంటూ అయినా సినారె తెలుగు సాహిత్యంలో గొప్ప పట్టు సాధించారన్నారు.

KCR 02

మీకు తెలుగు రాదు.. మీ తెలుగులో తురకం ఎక్కువగా ఉందని ఆంధ్రావారు అంటుంటారని అయితే సినారే తెలుగు భాషలోని అన్ని మాండలిక పదాలపై పట్టు సాధించారని చెప్పారు. తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినారె రాసిన మందార మకరందాలు గ్రంథం మీద వ్యాసం రాశానని, దానికి తనకు మొదటి బహుమతి వచ్చిందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. బొంబాయి పోయిన కొడుకు కారటు రాయడాయె.. అన్న తెలంగాణ మాండలికం లో సైతం సినారె రచనలు చేశారని చెప్పారు. మాండలికాలను ప్రస్తావిస్తూ ఎవరి తల్లి వాళ్లకు ముద్దు.. అందుకే సినారే తెలంగాణ మాండలికంలో కూడా పాటలు రాసి అభిమానం వెల్లడించుకున్నారని చెప్పారు.

చెప్పదలుచుకున్నది చెప్పకుంటే గుండె బరువెక్కుతుంది. అది సినారెకు తెలుసు. అందుకే తాను చెప్పదలుచుకున్నదే చెప్పారన్నారు. సినిమా పాటల విషయానికి వస్తే గులేబకావళి కథ చిత్రంలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. అనే పాటతో ప్రారంభించి నిన్న మొన్నటి ఒసేయ్..రాములమ్మ సినిమా వరకు మరువలేని గీతాలను అందించారని చెప్పారు. అనంతరం సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం ప్రస్తావించినట్టు మా ఊరు మాట్లాడింది అనే గేయ సంపుటిలో బొంబాయికి వెళ్లిన పద్మశాలి యువకుడి తల్లి ఘోషను వినిపిస్తూ కరీంనగర్ మాండలికంలో పాట రాశానని గుర్తు చేసుకున్నారు.

KCR 01

నా ఇష్ట దూవం వాక్కు, శబ్ధమే నన్ను నడిపించింది అని తన కావ్య ప్రస్థానాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ సినారే తెలంగాణకు ఒక వరం అని కొనియాడారు. తెలంగాణ తొలి జ్ఞానపీఠ గ్రహిత సినారేనని గుర్తుచేశారు. దర్భశయనం శ్రీనివాసాచార్యులు గ్రంథసమీక్ష చేశారు. ప్రసంగానికి ముందు వంశీ రామరాజు సంస్థ సమకూర్చిన రూ. 25 వేల నగదు, వస్ర్తాలను వికలాంగ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయని శారద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.