సాగునీటికి అధిక ప్రాధాన్యం

– ప్రాణహిత- చేవెళ్లలో భాగంగా మెదక్ జిల్లాలో రెండు భారీ రిజర్వాయర్లు
– 5.5లక్షల హెక్టార్లు సాగయ్యే అవకాశం: మంత్రి హరీశ్‌రావు వెల్లడి

Harish-Rao-01

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టులను నిర్మించేందుకు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా 51 టీఎంసీల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్లను సిద్దిపేటలోని తడ్కపల్లి, గజ్వేల్ ప్రాంతాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.9వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఎం ప్రాజెక్టుల నిర్మాణంతో జిల్లాలోని 5.5 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరందించేందుకు రూ.4,200 కోట్ల తో జలజాలం పనులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే లక్ష్యంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.12 వేలకు పెంచాయన్నారు. పార్టీలకతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి మహిళా, యువజన సంఘాలు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.