రైతులను ఆదుకుంటాం

-పరిశ్రమలకు పవర్‌హాలిడే ఇచ్చైనా సాగుకు కరెంట్ ఇస్తాం
-గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే కష్టాలు: మంత్రి కేటీఆర్

KTR 01
పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌హాలిడే ఇచ్చైనా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం పెద్దూరులో రూ.70కోట్లతో నిర్మించే 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో కొందామన్నా కరెంటు లేదని తెలిపారు.

విద్యుత్ కొరత తమ వల్ల రాలేదని, గత ప్రభుత్వాల పనితీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ప్రభుత్వాలకు ముందుచూపు లేని కారణంగా పక్క రాష్ర్టాల నుంచి కరెంట్ కొందామన్నా ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయలేదన్నారు. యుద్ధ ప్రాతిపాదికన ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. రైతులు ఆందోళన పడొద్దని, ఎంత ఖర్చయినా సరే ఎన్ని కష్టాలకోర్చైనా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ట్రాన్స్‌కో సీఈ భాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.

సమగ్ర సర్వే ప్రపంచ చరిత్రలోనే నూతన ఒరవడి: కేటీఆర్
వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ప్రజల సహకారంతో నూతన ఒరవడికి నాంది పలికిందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడలోని సంగీత నిలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు చేకూర్చేందుకు ఈ సర్వేను నిర్వహించారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని వక్రభాష్యాలు చెప్పినా ప్రజలు ఏమీ పట్టించుకోకుండా వారి భాగస్వామ్యంతో జరిగిన ఈ సర్వేను విజయవంతం చేశారన్నారు. ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో నిరుపేదలకు ఇండ్లు, పెన్షన్ లాంటివి సంపూర్ణంగా అందుతాయన్న విశ్వాసం తమకు ఉందన్నారు.