రైతులకు కొత్త రుణాలు ఇప్పించండి

ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీలో బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చే విషయంలో కొంత సంశయిస్తున్నాయని, రైతలకు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు సూచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కోరారు. రైతులకు రుణమాఫీ పథకానికి రిజర్వు బ్యాంకు నుంచి పూర్తి సహాయ, సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రిజర్వు బ్యాంకు గవర్నర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఆయనకు సీఎం వివరించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి బ్యాంకుల పూర్తి సహకారం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతామని అన్నారు.
-పరిశ్రమలకూ అధిక రుణాలివ్వండి
-ఆర్‌బీఐ గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వినతి
-సాధ్యమైనంత సహకరిస్తామన్న రాజన్
-చెరువుల పునరుద్ధరణకు నిధులిస్తామని హామీ

KCR with RBI Governor Raghuram Rajan
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజన్ అభినందించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందించేందుకు చిన్న బ్యాంకులకూ లైసెన్స్‌లు ఇస్తామని రాజన్ ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పారిశ్రామిక విధానాన్ని త్వరలో తెస్తున్నామని, ఇది దేశంలోనే ఉత్తమమైనదిగా ఉండబోతున్నదన్నారు. పరిశ్రమలకోసం రెండు నుంచి మూడు లక్షల ఎకరాల భూమిని సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి రుణసహాయం అందించి, ప్రోత్సహించాలని కోరారు.

ఇందుకు స్పందించిన రాజన్.. తెలంగాణ ప్రభుత్వం తమనుంచి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా సంప్రదించవచ్చని చెప్పారు. రిజర్వు బ్యాంకు పరిధిలో ఉన్నంత మేరకు సహాయం అందించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణను యజ్ఞంగా చేపడుతున్నామని, ఇందుకు సుమారు రూ.25 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఆర్‌బీఐ గవర్నర్‌కు తెలిపారు. రిజర్వు బ్యాంకు నుంచి కూడా ఆర్థిక సహాయం అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనకు రిజర్వు బ్యాంకు ఒక ప్రత్యేక విధానాన్నే అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా చెరువుల పునరుద్ధరణకు కూడా నిధులు ఇస్తామని రాజన్ చెప్పారు.

హైదరాబాద్ త్వరలోనే భారీ పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్నదని, ఎంతోమంది కొత్త పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని రాజన్‌కు కేసీఆర్ తెలిపారు. రాబోయే మూడేండ్లలో తెలంగాణ మిగులు విద్యుత్‌గల రాష్ట్రంగా మారుతుందని రాజన్‌కు చెప్పారు. ముఖ్యమంత్రితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ అయిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వీ నాగిరెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, పలువురు రిజర్వు బ్యాంకు అధికారులు ఉన్నారు.