రైతుల అభ్యున్నతే లక్ష్యం

-రైతు అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం కడియం
-రైతును రాజు చేయడమే లక్ష్యం: మంత్రి పోచారం

రైతుల అభ్యున్నతే సర్కార్ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల రైతు సమన్వయ సమితులకు అంబేద్కర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నడవడిక, చూపు అంతా అవినీతి మయమేనని చరిత్ర చెప్తున్నదన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచి ఈ రాష్ర్టాన్ని నిలువునా దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి తమ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. రైతు గౌరవంగా బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో రైతు సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడారు. వచ్చే యాసంగి నుంచి 24గంటల విద్యుత్ అందిస్తామన్నారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదన్నారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్, విప్ నల్లాల ఓదెలు, బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ధనిక రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలోనే ఉన్నారని చెప్పుకునేలా సమాధానం రావాలని, ఆ దిశగా రైతులను తయారు చేస్తామని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పోచారం అన్నారు. ఎద్దు ఎవుసం లేనోడిని ఆదర్శ రైతును చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదని మంత్రి పోచారం విమర్శించారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మంత్రి పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పండించిన పంటకు రైతులే ధర నిర్ణయించుకునే విధంగా సమన్వయ సమితులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రైతు అభ్యున్నతిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ రైతు సదస్సులో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఖమ్మం జిల్లా వైరా నేలకొండపల్లి మండలాల్లో జరిగిన సదస్సుల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతులు నిజాయితీతోఉంటారనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతు సమితులు ఏర్పాటు చేసి వారికి బాసటగా నిలుస్తున్నారన్నారు.

గత పాలకుల హయాంలో వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చిందన్నారు. గత పాలకులు పెండింగ్‌లో ఉంచిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు సాగునీరందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి, కొల్లాపూర్ వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలాల సమన్వయ సమితి సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రైతులను సంఘటితపర్చి తాము పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందన్నారు.

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హాలియాలో నియోజకవర్గ రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుల్లో విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సమన్వయ సమితులు దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. ఇకపై సమన్వయ కమిటీల సహాయంతో రైతులే ధరను నిర్ణయించబోతున్నారని తెలిపారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల్లో జరిగిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి మొత్తాన్ని సైతం అందించనున్నదని చెప్పారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో జరిగిన సదస్సుల్లో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. అన్నం పెట్టే రైతులను సుఖ సంతోషాలతో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. రైతును రాజు చేయాలనే సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ మండలం వడ్లకొండలో నిర్వహించిన రైతు సదస్సులో అన్నారు. దేవాదుల కాల్వ నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతు యాదవరెడ్డి కాళ్లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మొక్కారు. ప్రతి రైతునూ ధనికుడిని చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.