రైతుబంధుకు రెడీ

-చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం
-అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ
-చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం

రైతుబంధు పథకం కింద రానున్న వానకాలం సీజన్‌కు సంబంధించి మే పదో తేదీ నుంచి ప్రారంభించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు అవగాహన సదస్సులను వ్యవసాయశాఖ నిర్వహిస్తున్నది. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, జిల్లా, మండల రైతు సమన్వయసమితి సభ్యులు పాల్గొంటున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాలలో ఈ సదస్సులు ముగిశాయి. రైతులకు ముందస్తుగా పెట్టుబడి సమకూర్చడానికి ప్రపంచంలోనే మొదటిసారిగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతుబంధు పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరానికి ఎనిమిదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. వానకాలం సీజన్‌కు సంబంధించి మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు రూ. నాలుగువేల చొప్పున రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 1,39,71,568 ఎకరాలకు రూ.5,588.62 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనున్నారు. 58 లక్షల మంది రైతులకు ఈ చెక్కులను అందిస్తారు.

యాసంగి పంటకు నవంబర్ 18 నుంచి చెక్కులు
యాసంగి పంటల కోసం నవంబర్ 18 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేసేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. రెవెన్యూశాఖ భూప్రక్షాళనలో పార్ట్ ఏ కింద 93 శాతం భూముల వివరాలిచ్చింది. వీటన్నింటికీ రైతుబంధు పథకం అమలు కాను న్నది. రైతుబంధు చెక్కులను, పాస్‌పుస్తకాలతోకలిపి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చెక్కులు, పాస్ పుస్తకాలు మండలాలకు చేరాయి. వీటిని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. పంపిణీ కోసం ప్రతి మూడొందల మంది రైతులకు ఒక టీంను ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇబ్బందులు లేకుండా ఈ పంపిణీ కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర వ్యవసాయరంగంలో రైతుబంధు పథకం ఒక చారిత్రాత్మక మలుపుగా మారనుంది.

పెట్టుబడి మొత్తంలో నల్లగొండ టాప్
రైతుల సంఖ్యలో, భూమి విస్తీర్ణంలో, ఎక్కువ పెట్టుబడి మొత్తాన్ని అందుకోవడంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 4,38,589 మంది రైతులకు 11.65 లక్షల ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది. ఇందుకోసం రూ.466 కోట్ల పెట్టుబడిగా లభించనున్నది. జిల్లాలో సుమారు 6,119 మంది రైతులు రూ.50వేలకుపైగా పెట్టుబడి సాయం అందుకోనున్నారు. వీరికి రెండు చెక్కులు ఇవ్వనున్నారు.

చెక్కుల పంపిణీకి ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం
రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఈ పథకం గురించి ఆయా రాష్ట్రాల ప్రధాన పార్టీల నేతలకు వివరించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతోపాటు, తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. మే 10న ప్రారంభించనున్న రైతుబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఏయే జిల్లాల్లో ప్రారంభిస్తారనే అంశం అధికారికంగా రెండు, మూడు రోజుల్లో ఖరారుకానున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.