రైతు కుటుంబాలను ఆదుకుంటాం

రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు.పదేండ్లపాటు అధికారంలోని ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడూ రైతుల సంక్షేమం కోసం పనిచేయలేదని.. రాజకీయ ప్రయోజనాల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నాం..
-రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీ విమర్శలు
-టీఆర్‌ఎస్ రైతుపక్షపాత ప్రభుత్వం: మంత్రి పోచారం

Pocharam-Srinivas-Reddy
శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ప్రశాంత్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి రైతుల కోసం కేంద్ర మంత్రులను కలిసినట్లు మొసలి కన్నీరుకారుస్తూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1998 నుంచి 2014 వరకు కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణలో 3,915 ఆత్మహత్యలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతు ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుల కోసం రూ.482 కోట్ల ఇన్‌పుట్ సబ్సీడీ విడుదల చేశారని గుర్తు చేశారు. పదేండ్లలో ఒక్క చెరువునైనా గత ప్రభుత్వాలు మరమ్మత్తులు చేసిన పాపానపోలేదని పోచారం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 44 వేల చెరువులను మరమ్మతులు చేపట్టాలని గుర్తించినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ నుంచి 9వేల చెరువుల మరమ్మతులు చేపడతామని తెలిపారు.

తడిసిన మొక్కజొన్న , పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పిన పోచారం.. నవంబర్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయపాల ధరలను రైతులకు రూ.4 పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్‌హౌజ్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పోచారం తెలిపారు.