రైతే..రారాజు

-రైతుబంధుతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు
-పెట్టుబడిసాయం పథకం దేశంలోనే తొలిసారి
-రైతుకు బహుళ ప్రయోజనాలు కల్పిస్తున్న తెలంగాణ సర్కారు
-సీఎం కేసీఆర్ స్వయాన రైతు కావడం మన అదృష్టం
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఆరుగాలం శ్రమించే రైతుకు కష్టమొస్తే కనీస పట్టింపు కరువు.. సాగుకు ముందుకెళ్లాలంటే పెట్టుబడి కోసం నిరీక్షణ.. చెప్పులను వరుసలో పెట్టి విత్తనాలు, ఎరువులు పొందే దుస్థితి.. వీటన్నింటినీ దాటుకుని ముందుకెళితే కరంట్ ఎప్పుడొస్తదో.. పోతదో తెలియని అయోమయం.. సమైక్యరాష్ట్రంలో ఇన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న రైతును స్వరాష్ట్రంలో రారాజుగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం అని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా కల్పిస్తున్న సౌకర్యాలతో అన్నదాతలు మురిసిపోతున్నారని, సమయానికి విత్తనాలు, ఎరువులు పం పిణీ. నిరంతరం విద్యుత్ సరఫరా, సాగుకు పుష్కలమైన నీరు. మోడుబారిన చెరువుల్లో జలకళతో సీఎం కేసీఆర్ కొం డంత అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు రైతుబంధు పేరిట దేశంలోనే తొలిసారిగా ముందస్తు పెట్టుబడితో అన్నదాతలకు ఆర్థిక చేయూతనందించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. రైతుబంధు పథకం నేటినుంచి ప్రారంభం కాబోతున్నవేళ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

నమస్తే తెలంగాణ: పెట్టుబడి సాయం పథకం ఉద్దేశాలేంటి?
పోచారం: రైతు పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. మృగశిర కార్తె వచ్చిందంటే వానకాలం సాగుకు రైతు సిద్ధమవుతాడు. కానీ, విత్తనాలు, ఎరువుల కోసం ముందస్తుగానే అప్పులు చేసి వడ్డీభారం మీదేసుకుంటున్నాడు. పండిన పంట ఆ వడ్డీలకే సరిపోని పరిస్థితి. ఈ దురావస్థను రూపుమాపేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సాగుకు అవసరమయ్యే ఖర్చును ముందుగానే అందించేందుకు సిద్ధమయ్యారు. ఎకరాకు రూ.4 వేలు అందిస్తున్న ఈ పథకం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు ఇలాంటి పథకం రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నమస్తే: ఈ పథకానికి స్పందన ఎలా ఉంటుందనుకుంటున్నారు?
పోచారం: సీఎం కేసీఆర్ స్వయాన ఓ రైతు. రైతుబిడ్డనే ముఖ్యమంత్రి సీట్లో ఉండడం రాష్ట్రప్రజల అదృష్టం. సీఎం కేసీఆర్ నాలుగేండ్లుగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించగానే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి రావడం చారిత్రాత్మకమైన ఘట్టం. కర్షకలోకానికి ఇదో పండుగలాంటిది. పెట్టుబడి సాయంపై కేంద్రంతోపాటు, పలు రాష్ర్టాలు అధ్యయనాలు ప్రారంభించాయి. తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

నమస్తే: లబ్ధిదారులు ఎందరు? ఎంత సాయం అందిస్తున్నారు?
పోచారం: ఈ పథకం కింద 58.33 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్రంలో 1,43,27,000 మందికి 58.98 లక్షల చెక్కులు అందిస్తాం. వీరికి ఎకరానికి రూ.4 వేల చొ ప్పున ఇప్పటికే రూ.5,730 కోట్లు బ్యాంకుల్లో నిల్వ చేశాం.

నమస్తే: కౌలురైతులకు ఎందుకు అమలుచేయడం లేదు? పోచారం: ఈ పథకాన్ని కౌలురైతుకు అమలుచేయడానికి న్యా యపర సమస్యలున్నాయి. ఈ విషయంలో కౌలురైతు, పట్టాదారులు అవగాహనతో వ్యవహరించాలి. సీఎం కేసీఆర్.. మంత్రులు, అధికారులు, న్యాయశాఖ అధికారులతో చర్చించిన తర్వాతే పట్టాదారులకే వర్తింపచేయాలని నిర్ణయించారు.

నమస్తే: రైతు, మంత్రిగా పథకంలో భాగస్వామ్యం ఎలా ఉంది?
పోచారం: తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యవసాయశాఖమంత్రిగా విధులు నిర్వర్తించడంతోపాటు సీఎం కేసీఆర్ సారథ్యం లో పనిచేయడం పూర్వజన్మ సుకృతం. రైతులకు మేలుచేసే అనేక కార్యక్రమాలను సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా అమలుచేస్తుంటే ఎంతో సంతోషం కలుగుతున్నది. పెట్టుబడిసాయం పథకం ఒక రైతుగా సంబురం అనిపిస్తున్నది.

నమస్తే: సర్కారు సాగు సంస్కరణల ఫలితాలు ఎలా ఉన్నాయి?
పోచారం: స్వరాష్ట్రంలో అన్నదాతల తలరాత మారింది. కరం ట్ కోసం రాత్రిళ్లు మోటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పని ఇప్పుడు లేదు. ప్రభుత్వం వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేస్తున్నాం. 24 గంటలు కరంట్ ఇస్తున్నాం. సాగుకు ఢోకా లేకుండా నీళ్లు, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుకు మేలు చేస్తున్నాం. రుణ మాఫీతో రైతును ఆర్థిక ఉచ్చులో నుంచి బయటపడేశాం.

నమస్తే: చెక్కులు, కొత్తపాస్‌బుక్కుల పంపిణీ ఎన్ని రోజులు?పోచారం: మే10 నుంచి వారం రోజులపాటు రైతులకు చెక్కులతో పాటు, డిజిటల్ పాస్‌పుస్తకాలను అందివ్వనున్నాం.

నమస్తే: మీరు సాయం వదులుకున్నారు. ఇతరులకు మీ సలహా?
పోచారం: నా కుటుంబీకుల పేరుమీద ఉన్న మొత్తం 30 ఎకరాలకు వచ్చే పెట్టుబడి సాయం మొత్తాన్ని వదులుకున్నా. స్వచ్ఛందంగా ఇచ్చే వారుంటే ఓ నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేస్తే ఆ మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి చేరుతుంది.