రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

-తహసీల్దార్ల సంఘం డైరీ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనలో తహసీల్దార్లు కీలక భూమిక పోషించారని, బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ 2015 డైరీ, క్యాలెండర్‌ను ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

KCR with MRO's Association Members

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను స్వరాష్ట్రంలో పరిష్కరించాలని, తహసీల్దార్లందరికీ వాహన సదుపాయాన్ని కల్పించాలని సీఎంను కోరారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, తహసీల్దార్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గోపీరాం, కోశాధికారి కే చంద్రకళ, మెదక్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.