రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తా

రెవెన్యూశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూశాఖ ఉద్యోగ సంఘాల కాన్ఫెడరేషన్ కన్వీనర్ వీ లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు నెలకొన్న సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

Mahmood ali

-త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతా
-డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సర్కార్ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడుతుందని స్పష్టంచేశారు. అదేస్థాయిలో అర్హులకు ప్రభుత్వ సంక్షేమపథకాలు అందేలా కృషిచేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉన్నదని ఆయన గుర్తుచేశారు. తనదృష్టికి తెచ్చిన అంశాలపై శాఖ ముఖ్యకార్యదర్శితో సమీక్షించి, సీఎం కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తెస్తానని కాన్ఫెడరేషన్ ప్రతినిధులకు మహమూద్ అలీ హామీనిచ్చారు. కాన్ఫెడరేషన్ కన్వీనర్ వీ లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో రెవెన్యూ ఉద్యోగులు కంటిమీద కునుకు లేకుండా పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం రూపొందించిన పలు సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తున్నామన్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీసీఎంను కోరామన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ను అదనపు జాయింట్ కలెక్టర్‌గా పరిగణించి ప్రత్యేక వేతనశ్రేణిని రూపొందించాలన్నారు. తహశీల్దార్లందరికీ వాహన వసతి కల్పించాలని కోరారు. తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. గ్రామం యూనిట్‌గా వీఆర్వోల నియామకం చేపట్టాలని చెప్పారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో వీఆర్వోలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వీఆర్‌ఏలకు 010 పద్దు కింద గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇంకా తాము పలు సమస్యలను వివరించగా ఆయన సానుకూలంగా వ్యవహరించారన్నారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో కాన్ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు కే లక్ష్మయ్యలతోపాటు సభ్యులు వీ లక్ష్మీనారాయణ, జీ ఉపేందర్, బీ రాంరెడ్డి, ఈ రామకృష్ణ, బీ శ్రీనివాసులు, బీ రమేష్ తదితరులు ఉన్నారు.