రిటైల్ మార్కెట్‌కూ నూతన పాలసీ!

త్వరలో నూతన రిటైల్ మార్కెట్ పాలసీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానంలాగే సింగిల్‌విండో రిటైల్ మార్కెట్ పాలసీ తేవాలనేది ప్రభుత్వ అభిమతమని ఆయన చెప్పారు. శుక్రవారం పలు ప్రముఖ రిటైల్ వ్యాపారసంస్థల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకుని తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. రాష్టంలో రిటైల్ మాల్స్‌ను భారీగా విస్తరించాలనుకుంటున్నామని, ఈ దిశగా తమకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం కావాలని అభ్యర్థించారు.

KCR review with Retailers

-అందరి అభిప్రాయాలు తీసుకుంటాం.. వ్యాపార విస్తరణ ప్రణాళికాబద్ధంగా ఉండాలి
-పరిశ్రమ విస్తరణ అభివృద్ధికి సూచిక.. కాలనీలు, అపార్టుమెంట్లలో స్థలం తప్పనిసరి చేసే ఆలోచన
-సీఎం కే చంద్రశేఖర్‌రావు వెల్లడి.. సీఎంను కలిసిన ప్రముఖ రిటైల్ వ్యాపారసంస్థల ప్రతినిధులు
మాల్స్‌లో 365 రోజులపాటు నిరంతరాయంగా వ్యాపారం నిర్వహించుకునే వీలు కల్పించాలని, వివిధ అంశాల్లో ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలు సవరించాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రిటైల్ రంగానికి అత్యుత్తమ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఈ పాలసీ రూపొందించే ముందు అందరి అభిప్రాయాలు తెలుసుకుంటామని, ఇందులో భాగంగా రిటైల్ మార్కెట్ నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

నగరాల అభివృద్ధికి రిటైల్ మాల్స్ విస్తరణ కూడా ఓ సూచికగా ఉంటుందని, అయితే ఆ విస్తరణ ప్రణాళికాబద్ధంగా జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఇప్పటికే మల్టిప్లెక్స్‌లు, రిటైల్ షాపింగ్ చెయిన్‌లు ఏర్పాటయ్యాయని, త్వరలోనే ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ నగరాలకు కూడా ఇవి విస్తరిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో మాల్స్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నదని అన్నారు. పెద్ద పెద్ద కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇతర నివాస గృహాల సముదాయాలు నిర్మించే సందర్భంలోనే రిటైల్ మార్కెట్‌కు కూడా అవసరమైన స్థలాన్ని వదలడం తప్పనిసరి చేయాలనే ఆలోచన ఉందన్నారు.

అలాగే మాల్స్ ఏర్పాటు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు ఉండాలని, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే మహిళల భద్రత కోసం తప్పనిసరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రిటైల్ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు విజ్ఞాపనలను అందచేశారు. వ్యాపారానికి ఒకచోట లైసెన్స్ పొందిన ప్రధాన రిటైల్ సంస్థ,అదే లైసెన్స్‌పై ఇతర ప్రాంతాల్లో కూడా దాని అనుబంధ శాఖలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండేలా నిబంధనలు సవరించాలని కోరారు. మాల్స్‌లో రాత్రివేళల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, లైఫ్ స్టైల్ ప్రతినిధి కబీర్, వాల్‌మార్ట్ ప్రతినిధి మురళి, షాపర్స్‌స్టాప్ ప్రతినిధి రవీందర్, బిగ్‌బజార్ ప్రతినిధి రాకేష్, రిలయన్స్ ప్రతినిధి వేణుగోపాల్, రిటైల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు నగేష్, రజనీష్, రాజేందర్, గౌతమ్, ఆశీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.