రెండేండ్లలో విద్యుత్‌లోటు అధిగమిస్తాం

– బంగారు తెలంగాణ సాధిస్తాం: డిప్యూటీ సీఎం రాజయ్య
-విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలి: స్పీకర్ సిరికొండ

Deputy CM Rajaiah

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌లోటును అధిగమిస్తామని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. గురువారం వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో సర్పంచ్ గాడిపెల్లి చంద్రకళా శ్రీనివాస్, కళ్లెంలో మార్పు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ కొరత ఉందన్నారు. వీటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. మ్యానిఫెస్టోలో లేకున్నా గిరిజన, దళిత, మైనార్టీ అమ్మాయిల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకాన్ని కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. లక్ష దళిత కుటుంబాలకు భూములు పంపిణీ చేసి మొదటి ఏడాది సాగుకయ్యే ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా కృషి చేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటైన ఫలితాలు తీసుకురావాలన్నారు.

అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ చదువుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు పోటీపపడాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు చదువుకోవాలం టే చాలా భారంగా ఉండేదని, ప్రస్తుతం సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. టీఆర్‌ఎస్ సిద్ధాంత కర్త జయశంకర్ చదివింది ఉర్దూ మీడియంలోనైనా ఉపాధ్యాయ వృత్తి తెలుగు మాద్యమంలో కొనసాగిందని చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు.