రెండేండ్లలో మిగులు విద్యుత్

రెండేండ్లలో రాష్ట్రంలో 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేట, నంగునూరు మండలంలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించారు. గోడౌన్‌లకు శంకుస్థాపనలు చేశా రు. పాలమాకులలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
-పగటిపూటనే రైతులకు త్రిఫేజ్ కరెంటు
-అర్హులందరికీ పెన్షన్.. ప్రతిపక్షాలు,
-ప్రజలకు మంత్రి హరీశ్‌రావు సూచన
-కొన్నిపత్రికల ప్రచారం నమ్మవద్దు

Harish Rao Siddipet Constituency Visit

రామగుండం ఎన్‌టీపీసీ నుంచి 4 వేల మెగావాట్లు, ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి 6 వేల మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వెయ్యి మెగావాట్లు, మరో వెయ్యి మెగావాట్లు సోలార్ నుంచి, విండ్ పవర్, హైడల్ పవర్ ద్వారా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాబోయే రెండేండ్లల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని 24 గంటలు కరెంట్ ఇవ్వడంతోపాటు రైతాంగానికి పగటిపూటనే త్రిఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. రబీలో రైతాంగమంతా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామన్నారు. ఒకవేళ తీసేయాలనే ఉద్దేశం ఉంటే బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు ఎందుకు కేటాయిస్తామని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

కొన్ని ప్రతిపక్ష పార్టీలు, సీమాంధ్ర పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నాయని మండిపడ్డారు. వారి మాటలను, ఆ పత్రికలను ప్రజలు నమ్మవద్దన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి పూర్తిస్థాయిలో ఆదుకున్న ప్రభుత్వం తమదేనన్నారు. ధాన్యం అమ్మిన మూడు లేదా నాలుగు రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు.

చంద్రబాబువి మోసాలు: గత ప్రభుత్వాల పాపాల వల్ల రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘిస్తున్నాడన్నారు. చట్టం ప్రకారంగా పదేండ్లపాటు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే, ఏపీ సీఎం మనకు రావాల్సిన 54 శాతం విద్యుత్ వాటాను ఇవ్వడం లేదన్నారు.