రికార్డు సభ్యత్వాలు

-73లక్షలతో కారు దూకుడు
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం 73 లక్షలు దాటింది. ఈ నెల 21న పార్టీ ప్లీనరీ నా టికి 75 లక్షలను దాటే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరం 51లక్షల మంది పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈసారి అదనంగా మరో 25 లక్షల మంది సభ్యత్వాలు స్వీకరిస్తారని పార్టీ నాయకత్వం అంచనా వేసింది. దానికి అనుగుణంగానే సభ్యత్వ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే 73లక్షలు దాటేసిన సభ్యత్వం కొంపల్లిలో జరిగే ప్లీనరీ నాటికి లక్ష్యాన్ని అధిగమిస్తుందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ప్లీనరీలో సభ్యత్వ వివరాలు అ ధికారికంగా ప్రకటిస్తారు. పార్టీలో సా ధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీలక సభ్యత్వానికి రూ.100 రుసుం తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి క్రియాశీలక సభ్యత్వాల రుసుములో రూ. 50 మినహాయింపు ఇస్తున్నారు. కాగా పార్టీకి సభ్యత్వాల ద్వారా ఇప్పటివరకు రూ.12 కోట్లకుపైగా నగదు, కోటిరూపాయల విలువైన డీడీలు వచ్చాయి. మరో రూ.12 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 73లక్షల సభ్యత్వం నమోదు కావడంపై పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. దక్షిణ భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా టీఆర్‌ఎస్ నిలబడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు..
టీఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలందరికీ రూ.2లక్షల ప్రమాద భీమా చేయిస్తున్నారు. దీనివల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక ఆలంబన అందుతున్నది. గత సంవత్సరం వెయ్యిమందికి పైగా కార్యకర్తలను పార్టీ కోల్పోయింది. ఆ సమయంలో పార్టీ నేతలు దగ్గరుండి ఇన్సూరెన్స్‌నుంచి పరిహారం ఇప్పించారు. ఇందుకోసం తెలంగాణభవన్‌లో ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తగిన డాక్యుమెంట్లు తెచ్చి ఇక్కడ అప్పగిస్తే చాలు..ఇక్కడున్న ప్రత్యేక టీము మిగిలిన ఇన్సూరెన్స్ దరఖాస్తుల ప్రాసెస్ పనిని వెంటపడి చేయిస్తుంది. గరిష్ఠంగా నెల రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటుంది.