ఆర్డీఎస్‌పై ఆంధ్రా జులుం

– కేంద్ర బలగాలను పెట్టి ఆర్డీఎస్ పనులు పూర్తిచేసి తీరుతాం
– పరిశ్రమలకు కోత విధించైనా సాగుకు కరెంటు ఇస్తాం
– జిల్లాకో ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయం
– వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం
– మంత్రి హరీశ్‌రావు హామీ

Harish Rao
ఆర్డీఎస్ విషయంలో సీమ గుండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. ఆధునీకరణ పనుల వద్ద కేంద్ర బలగాలను పెట్టి పనులు పూర్తి చేస్తాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాం అని భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చాలెంజ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చిన మంత్రి వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఆర్డీఎస్‌ను పట్టించుకోకపోవడం వల్లే నేడు రైతులకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. ఆర్డీఎస్ కింద ఉన్న 87,500 ఎకరాలకు నీరు పారించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకో ఇరిగేషన్ కార్యాలయం నిర్మించుకున్న సీమాంధ్ర పాలకులు, తెలంగాణపై వివక్ష ప్రదర్శించి నాలుగు జిల్లాలకు కలిపి ఒక ఎస్‌ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకో ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయాలను నెలలోపు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలుపరుస్తామని, అపోహలు వద్దన్నారు. విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణం: మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. అభివృద్ధి అంటే ఏమిటో ఐదేండ్లలో చేసి చూపిస్తాం అని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయని, ప్రస్తుత విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. రెండు రాష్ర్టాలుగా విడిపోయినప్పటికీ చంద్రబాబు తెలంగాణలో తన మార్కు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ విద్యుత్ విషయంలో కూడా అడ్డు తగులుతున్నాడని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని, పరిశ్రమలకు కోత విధించైనా రైతులకు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

విద్యుత్ కొరతను నివారించడానికి ఇతర రాష్ర్టాల నుంచి 5వేల మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ సమస్య విషయంలో రైతులు సహకరించాలని కోరారు. అవినీతి, పేదరికం, ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మించుకుందామన్నారు. ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితం, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలకు శాంతి చేకూరాలంటే అన్ని జిల్లాల్లో సాగు, తాగునీరు అందించినప్పుడే అది సార్థకమవుతుందన్నారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, రుణమాఫీపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తుమ్మిళ్ల లిప్టు సర్వే కోసం నిధులు మంజూరు చేశామని, ప్రాజెక్టు రిపోర్టు వచ్చాక పనులు ప్రారంభమవుతాయన్నారు. అంతకుముందు అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ, శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను మంత్రి సందర్శించారు.

అలంపూర్ నుంచి ఎరిగేర వరకు రూ.48 కోట్ల తో వేసే రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. వడ్డేపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాసులు, ఎంపీపీ సుజాత, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు హరీశ్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, సంపత్‌కుమార్, అంజయ్యయాదవ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్య, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, టీఆర్‌ఎస్ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కృష్ణమోహన్‌రెడ్డి, మంద శ్రీనాథ్ పాల్గొన్నారు.