రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా!

-గోదావరిఖని ఆసుపత్రిలో ఉపముఖ్యమంత్రి హల్‌చల్..
-తెల్లవారు జామున 4 గంటల దాకా రాత్రి విధులు..
-తనిఖీలు, పరీక్షలు, సమీక్షలతో వైద్య సిబ్బందికి ముచ్చెమటలు..

DR-Rajaiah-Inspects-Godavarikhani--Area-Hospital

రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా..నంటూ ఆదివారం ఉదయమే క్లూ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మాత్యులు రాజయ్య, అనుకున్నట్లే రాత్రి విధులతో ఖని సర్కారు దవాఖానాలో హల్‌చల్ చేశారు. ఆదివారం రాత్రి 10:30కు ఆసుపత్రిలో ప్రవేశించిన ఆయన, అన్ని వార్డులను కలియదిరుగుతూ, రోగులను స్వయంగా పరీక్షించడమే గాక, తనిఖీలు, సమీక్షలతో ఉదయం 4 గంటలదాకా వైద్యసిబ్బందికి ముచ్చెమటలు పోయించారు. అటుపై గంటన్నర గడిచిందో లేదో విలేకరుల సమావేశం నిర్వహించి, సంచలనం సృష్టించారు.

రాత్రంతా కునుకు తీయకుండా ఖని ఆసుపత్రి సిబ్బంది, అధికారులను హడలెత్తించారు ఉపముఖ్యమంత్రి రాజయ్య. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చి రాత్రి 9 లేదా 10 గంటల వరకు సమీక్ష జరిపి, బస చేస్తారని భావించిన సిబ్బంది, వైద్య విధాన పరిషత్ అధికారులు అందుకనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. కాగా, ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చిన ఆయన అన్ని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ అవతారమెత్తి రోగులను పరీక్షించారు. అనంతరం వైద్య విధాన పరిషత్ అధికారులతోపాటు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాత్రి 1.30 గంటలకు సమావేశం ముగిసిన వెంటనే ఏరియా ఆసుపత్రిలో భోజనం చేశారు. రాత్రి 9, 10 గంటలలోపు డిన్నర్‌కు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ సమీక్షా సమావేశమయ్యేదాకా ఆయన భోజనం చేయలేదు. దీంతో సిబ్బంది, డాక్టర్లు కూడా భోజనం చేయకుండానే ఉండిపోయారు. ఇక భోజనం అయిపోయింది కదా.. సార్ పడుకుంటారని డాక్టర్లు, సిబ్బంది అనుకున్న సమయంలో ఆయన మరోసారి ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో తనిఖీలు ప్రారంభించారు. దీంతో అవాక్కైన వైద్యులు, సిబ్బంది ఆయన వెంట నడిచారు. ఉదయం నాలుగు గంటల దాకా తనిఖీలు చేస్తూ సిబ్బందిని, డాక్టర్లను, మెడికల్ సూపరింటెండెంట్‌ను అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లిన ఉపముఖ్యమంత్రి గంట తర్వాత లేచి ఉదయం 6-30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నివాసానికి బయలుదేరారు.

నిద్ర లేకున్నా ఉత్సాహంగా..
ఆదివారం ఉదయం నుంచి నిద్ర, వేళకు భోజనం లేకున్నా ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఎలాంటి అలసట లేకుండా కనిపించారు. అనుకున్న పని పూర్తి చేశారు. ఉదయం ఖని ఆసుపత్రిలో విలేకరుల సమావేశం తర్వాత ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నివాసానికి వెళ్లి అల్పాహారం చేసిన ఆయన సరదాగా అందరితో మాట్లాడారు. కొన్ని టీవీ చానళ్లతో విడివిడిగా మాట్లాడారు. తనకు వరంగల్‌లో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉందని, అందుకే వెళ్లిపోతున్నానని, లేకుంటే ఇంకా కొన్ని గంటలు ఉండేవాడినని ఆయన చెప్పడంతో నిద్రముఖాలతో అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బంది, వైద్య విధాన పరిషత్ అధికారులు విస్తుపోయారు.