రాష్ట్రమంతా పవర్ ఫుల్లు.. కాంగ్రెస్ నేతలకే నిల్లు

-అభివృద్ధిని అడ్డుకొనే విపక్షం ఉండటం దురదృష్టం
-పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేసు ఉపసంహరించుకొంటే 15 రోజుల్లో శంకుస్థాపన
-కొడంగల్ ప్రజలకు కాంగ్రెస్, టీడీపీల ద్రోహం కోస్గి, పరిగి సభల్లో మంత్రి హరీశ్‌రావు
-మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లో పలు అభివృద్ధి,పనులకు శంకుస్థాపన

తెలంగాణ ఏర్పడితే కరంట్ ఉండదనీ.. చీకట్లలో మగ్గుతారంటూ కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక కరంట్ ఫుల్లుగా ఉంటే.. కాంగ్రెస్ నేతలకు పవర్ లేకుండా పోయిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఓపక్క అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంటే.. అభివృద్ధిని వద్దు అనే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి వేసిన కేసును ఉపసంహరించుకొంటే పదిహేను రోజుల్లో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. శనివారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా కోస్గి, పరిగిలో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకొన్నదని పేర్కొన్నారు. ఓ పక్క ప్రాజెక్టులను అడ్డుకొంటూ.. మరోపక్క నిర్మాణ పనులు చేపట్టాలని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఆలోచించలేదని, సీట్లను కాపాడుకోవడానికే వారికి టైం సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు పథకం కొనసాగుతుంది. రైతులకు ఎకరాకు రూ.4 వేలు అందుతాయి. ఇందులో అనుమానాలు అక్కర్లేదు. దసరా తర్వాత రెండో విడుత రూ.4 వేలు ఇస్తాం అని స్పష్టంచేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా నిలిపారన్నారు.

కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపు
కొడంగల్ ప్రజలను టీడీపీ కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని.. ఎన్నికల్లో గెలుపొందేవరకే ప్రజలను వాడుకొన్నారన్నారు. కొడంగల్ ప్రజలను మోసం చేసిన ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పార్టీలకు జెండాలు పట్టే కార్యకర్తలే కరువయ్యారని ఎద్దేవాచేశారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కనున్నదని చెప్పారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, హరీశ్‌రావు ఎక్కడుంటే అక్కడ విజయముంటుందని, కొడంగల్‌లో గులాబీజెండా ఎగురడం ఖాయమన్నారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, మీడియాపులిగా హైదరాబాద్‌కు పరిమితమైన రేవంత్‌రెడ్డి.. కొడంగల్ అభివృద్ధి నిరోధకుడిగా మారారని దుయ్యబట్టారు. కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఆర్‌ఎస్ సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీ కొమరయ్య, ఆర్‌ఎం వరప్రసాద్ పాల్గొన్నారు.

కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఓవరాక్షన్
కొడంగల్‌లో మంత్రుల పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓవర్‌యాక్షన్ చేశారు. నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు రావడంతో జంకిన రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించడంతోపాటు మంత్రులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫైర్‌స్టేషన్ ప్రారంభవేదిక వద్దకు మంత్రులు రాకముందే ర్యాలీగా చేరుకొని బలనిరూపణ చేద్దామనుకున్న రేవంత్.. తన చిల్లర చేష్టలను ప్రదర్శించారు. అప్పటికే భారీగా చేరుకున్న టీఆర్‌ఎస్ నేతలు.. రేవంత్ అనుచరులకు గట్టిగా బదులిచ్చారు. రేవంత్, ఆయన అనుచరులను నియంత్రించడంలో పోలీసులు ముందస్తుజాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల మంత్రులు అసహనం వ్యక్తంచేశారు.