రాష్ట్ర సాగునీటి బడ్జెట్ దేశంలోనే టాప్

-2017-18 లో 18 శాతం కేటాయింపులు
-తొమ్మిది శాతంతో రెండో స్థానంలో ఏపీ
-తేల్చిచెప్పిన పీఆర్‌ఎస్ సర్వే
-2014-15లోనూ తెలంగాణ ప్రథమస్థానం.. అసోచామ్-2016 సర్వే వెల్లడి

తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణం కావాలన్న స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భగీరథ ప్రయత్నానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. రాష్ట్రం ఏర్పడింది మొదలు ప్రతిఏటా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నది. ప్రతిఏటా బడ్జెట్ కేటాయింపుల్లో సాగునీటిప్రాజెక్టులకు దేశంలోని ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ప్రాధాన్యం ఇవ్వటంలేదని అనేక సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. 2016లో వచ్చిన అసోచామ్ సర్వే మొదలు, తాజాగా ఆదివారం వెల్లడైన పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అధ్యయనంలోనూ ఇదే అంశం వెల్లడయింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని 19 రాష్ట్రాల బడ్జెట్లపై అధ్యయనంచేసిన పీఆర్‌ఎస్.. సాగునీటి రంగానికి 18 శాతం కేటాయింపులతో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని వెల్లడించడం విశేషం. సాగునీటి ప్రాజెక్టుల కారణంగా వ్యవసాయరంగం బలోపేతమై రాష్ట్ర ఆర్థిక ప్రగతి అనూహ్యంగా పెరుగుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
తెలంగాణలో సాగునీటిరంగాన్ని బలోపేతంచేయాలనే జల సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతియేటా బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏటా రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేస్తామని ప్రకటించిన ఆయన.. తదనుగుణంగా నిధులు మంజూరుచేస్తూ సాగునీటిరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటిరంగానికి నామమాత్రపు ప్రాధాన్యమిచ్చారు. ఇక తెలంగాణ ప్రాజెక్టులకైతే అరకొర కేటాయింపులే ఉండేవి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిరంగంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

సాగునీటి రంగానికి చేస్తున్న కేటాయింపుల్లో దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేదు. ఈ నేపథ్యంలో భారతదేశ సాగునీటిరంగంపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన అసోచామ్ (ది అసోసియేషన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) తెలంగాణ సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని 2016 ఏప్రిల్‌లో ప్రపంచానికి తెలియజేసింది. వివిధ రాష్ర్టాలు సాగునీటి రంగంపై పెట్టిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకొని అందులో ఏ రాష్ట్ర వాటా ఎంత ఉన్నదనే దానిని విశ్లేషించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సుమారు రూ.5.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడితే అందులో 11.6 శాతం తెలంగాణ వాటా ఉండటం విశేషం. సాగునీటిరంగానికి అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన మొదటి అయిదు రాష్ట్రాల్లో .. తెలంగాణ (11.6 శాతం), ఆంధ్రప్రదేశ్ (10.4 శాతం), మహారాష్ట్ర (9.4 శాతం), కర్ణాటక (9.4 శాతం), మధ్యప్రదేశ్ (5.8 శాతం) గా ఉన్నాయి.

అదే దూకుడు.. అదే వేగం..
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచీ దూకుడు తగ్గించలేదు. పనుల వేగమూ తగ్గలేదు. తాజాగా 2017-18 బడ్జెట్ కేటాయింపులపై పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (పీఆర్‌ఎస్) సర్వే ఆదివారం వెల్లడయింది. 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని 19 రాష్ర్టాలు ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సాగునీటి రంగానికి ఎంతమేర ప్రాధాన్యం ఇచ్చాయనే దానిపై పీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది. రాష్ర్టాలవారిగా చేసిన సర్వేలోనూ తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోని 19 రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపుల్ని ఆమూలాగ్రం పరిశీలించిన పీఆర్‌ఎస్.. సాగునీటిరంగానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు సాధారణంగా ఐదు శాతం కేటాయింపుల్ని చేపట్టినట్లు పేర్కొన్నది. కానీ తెలంగాణ ఏకంగా 18 శాతంతో టాప్‌వన్‌లో నిలిచిందని వెల్లడించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాలు చేసే కేటాయింపులు.. ఆయా రాష్ర్టాల భవిష్యత్ ఆర్థిక ప్రగతికి పెట్టుబడులుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులతోపాటు సామాజికంగానూ విప్లవాత్మక ప్రగతి కనిపిస్తుందని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తున్నారు.