రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్

రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్ర కంపెనీగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సిద్ధమైంది. తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలను చర్చించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతో అమెజాన్ రియల్ ఎస్టేట్ హెడ్ జాన్ షాట్లెర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. రెండుగంటలపాటు పలు అంశాలపై చర్చించిన బృందం రెండు నెలల్లో అమెజాన్ ఈ రిటైలింగ్ వేర్‌హౌస్ కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

KTR-with-Amazon-delegates01

-పెట్టుబడులకు సిద్ధమైన భారీ రిటైల్ కంపెనీ
-ఐటీ మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ
తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీ ప్రకారం అవసరమైన సహాయాన్ని అందజేస్తామని మంత్రి కేటీఆర్ ఆ సంస్థ బృందానికి హామీ ఇచ్చారు. అమెజాన్ తన ఆన్‌లైన్ వ్యాపారం(అమెజాన్.కామ్) ద్వారా తెలంగాణ హస్తకళలను ప్రొత్సహించాలని మంత్రి చేసిన సూచనలకు ఆ సంస్థ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగా తెలంగాణ స్వయంసహాయక సంఘాల ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రీ ఉత్పత్తుల వంటి హస్తకళలను మార్కెటింగ్ చేసేందుకు అమెజాన్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు తెలంగాణలోని చిన్న, మధ్య తరహా సంస్థల ఉత్పత్తులు అమ్ముకునేందుకు, ఆన్‌లైన్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు, శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.

అమెరికాలోని సియాటెల్‌లోని తమ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా అమెజాన్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఏప్రిల్ రెండోవారంలో అమెజాన్ కార్యాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ శాఖ కార్యదర్శి హరిప్రీత్ సింగ్, తెలంగాణ ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.