రాష్ర్టానికి ఛత్తీస్‌గఢ్ పవర్

-ప్రత్యేక లైన్ల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం..
-ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
-నేడు ఛత్తీస్‌గఢ్‌కు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జోషి

KCR 01

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వీలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి మిగులు విద్యుత్‌ను పొందేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం, తలెత్తుతున్న విద్యుత్‌లోటు అంశాలపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు వీలుగా ప్రస్తుతమున్న విద్యుత్ లోటు, వచ్చే రెండేండ్లలో నెలకొనే విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఇంధన శాఖ రూపొందించుకున్న కార్యాచరణపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాచరణకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం నిర్దేశించారు.

తక్షణ, మధ్యకాలిక (ఏడేండ్లు), దీర్ఘకాలిక(25 ఏండ్లు) ప్రణాళికలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌రంగాల్లో ఉన్న మిగులు విద్యుత్‌ను వినియోగించుకునే అంశాలపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తక్షణ అవసరాలకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ర్టానికి విద్యుత్తును తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని సీఎం అభిప్రాయంతో ఇంధన శాఖ, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఏకీభవించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయినందున ఆ రాష్ట్ర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) లైన్లతో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు తీసుకువచ్చేందుకు కారిడార్ బుకింగ్ చేయాలని, ఛత్తీస్‌గఢ్ నుంచి మరో 1,500 మెగావాట్ల విద్యుత్‌ను పొందేందుకు డెడికేటెడ్ లైన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్నెళ్లలోపు ఛత్తీస్‌గఢ్ మిగులు విద్యుత్ తెలంగాణ అవసరాలు తీర్చేలా ఉండాలని, విద్యుత్ యంత్రాంగం వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

సమావేశంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్‌ఎం రిజ్వీ, ట్రాన్స్‌కో జేఎండీ కార్తికేయమిశ్రా, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు విషయమై నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి శనివారం రాయ్‌పూర్ వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు (జీవోనెం.248) జారీచేశారు.