రాష్ట్రంలో టాటా సోలార్ పవర్ ప్లాంట్

రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖత వ్యక్తంచేసింది. టాటా గ్రూప్ కంపెనీలతో ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టాటా గ్రూప్‌లోని టాటా క్యాపిటల్, రిటైల్, ప్రాజెక్టు, ఆటోమొబైల్, డిఫెన్స్, కాఫీ, హౌసింగ్ తదితర విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మహేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

KTR-with-Tata-group-representatives

-200 మెగావాట్ల ప్లాంటు స్థాపనకు కంపెనీ సుముఖత
-మంత్రి కేటీఆర్‌తో టాటా గ్రూపు ప్రతినిధుల సమావేశం
-బయోమాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకూ సంసిద్ధత
సోలార్ పవర్‌పాటు బయోమాస్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేయడంతోపాటు తమ బృందం పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని టాటా బృందం మంత్రికి వివరించింది. విద్యుత్ ప్లాంట్ల కోసం సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఐటీశాఖ ఏర్పాటుచేస్తున్న టీ హబ్‌లో టాటా క్యాపిటల్ ద్వారా భాగస్వామ్యం అయ్యేందుకు సానుకూలంగా ఉందని, త్వరలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించిన బృందం హైదరాబాద్ వస్తుందని మంత్రి తెలిపారు.

టాటా ఆటోమైబైల్, టాటా కాఫీల విస్తరణ అవకాశాలపై చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో వ్యవహరిస్తున్న తీరు, స్పందిస్తున్న విధానం పట్ల టాటా గ్రూప్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై అంతర్జాతీయ సంస్థల రేటింగ్ పొందే కార్యక్రమానికి సహకారం అందిస్తామని టాటా గ్రూప్ తెలిపింది.

ఐటీ పెట్టుబడుల కోసం కేటీఆర్ రోడ్‌షోలు
-వివిధ నగరాల్లో మంత్రి ప్రత్యేక పర్యటనలు
-హైదరాబాద్‌లోని మౌలికవసతులపై ప్రచారం
-నేడు బెంగళూరులో పర్యటించనున్న మంత్రి

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ధిచేసేందుకు ఐటీ మంత్రి కే తారకరామారావు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక పర్యటనలు (రోడ్‌షో) నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్-సరికొత్త అవకాశాలు పేరిట వివిధ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన బెంగళూరులో పర్యటించనున్నారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని చవకైన మౌలిక వసతులు, ఐటీ కంపెనీల స్థాపన, వాటి విస్తరణకుగల అవకాశాలను వివరించనున్నారు. పెట్టుబడి పెట్టేందుకు కావాల్సిన ప్రధానమైన వాల్యూ టు ద రూపీ విషయంలో హైదరాబాద్ ఇతర నగరాలకన్నా ముందుందని పరిశ్రమ వర్గాలకు మంత్రి వివరించబోతున్నారు. టీహబ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మరింత విస్తరించే అవకాశాలు, ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలు విజయవంతంగా నడుస్తున్న తీరుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాబోయే ఐటీ పాలసీలో ప్రధాన అంశాలను మంత్రి వివరించనున్నట్లు సమాచారం. విదేశాల్లోనూ రోడ్‌షోలను నిర్వహించేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.