రాష్ర్టానికి 4 వేల మెగావాట్ల పవర్‌ప్లాంట్

-రామగుండంలో ప్రాంటు ఏర్పాటు
-సీఎంతో ఎన్టీపీసీ చైర్మన్ భేటీ
-ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ
-మౌలిక సదుపాయల
కల్పనకు ప్రభుత్వం సిద్ధం
-ఎన్టీపీసీ బందానికి సీఎం హామీ

KCR 003
విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు రామగుండంలో 4వేల మెగావాట్ల (5×800) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నేషనల్ థర్మల్ పవర్‌స్టేషన్ (ఎన్టీపీసీ) వెంటనే ప్రారంభించనుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్టీపీసీ చైర్మన్ అరూప్‌రాయ్ చౌదరి నేతత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మంగళవారం సమావేశమై చర్చించారు. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా, తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు, నీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా ప్రాజెక్టును ప్రారంభించాలని ఎన్టీపీసీ బృందానికి సీఎం సూచించారు పాజెక్టుకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్న రామగుండం పరిసరాల్లో ప్రాజెక్టు నిర్మించటం ఉత్పత్తి వ్యయం కూడా బాగా తగ్గుతుందన్నారు. రామగుండం ప్రాంతంలో మైనింగ్ పూర్తయిన సింగరేణి భూములను ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు అవసరాలకు వినియోగించుకునే విధంగా కేటాయింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని అధికారులకు సూచించారు. 39 నెలల్లోనే మొదటి యూనిట్‌లో ఉత్పాదన ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్టీపీసీ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్‌ఎన్ మిశ్రా, డైరెక్టర్ (టెక్నికల్) ఏకే జా, దక్షిణ ప్రాంత డైరెక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టును వెంటనే ప్రారంభిస్తున్నట్లు అరుప్‌రాయ్ కూడా ధ్రువీకరించారు.

బొగ్గు కొరతే అవరోధం: ఎన్టీపీసీ బృందం
విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికిబొగ్గు లింకేజీ అవరోధంగా ఉందని ఎన్టీపీసీ అధికారులు సీఎం దష్టికి తెచ్చారు. దీంతో సింగరేణి సంస్థ నుంచి కోల్ లింకేజీ ఇప్పించడానికి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం హామి ఇచ్చినట్లు సమాచారం. ఈ సమస్య పరిష్కారమయితే రామగుండంలో 660 మెగావాట్ల సామర్ధ్యంతో రెండు సూపర్ క్రిటికల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశముంది. 1320 మెగావాట్ల ఈ రెండు యూనిట్ల నిర్మాణానికి గాను రూ.7,920కోట్లు ఖర్చవుతాయని ఇప్పటికే అంచనా వేశారు. ప్రస్తుతం రామగుండం బీ థర్మల్ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి పరిశీలన చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నడుస్తోంది. ఈ ప్రాజెక్టు స్థానంలో 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు అవకాశాలను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేషీలోని టెక్నికల్ విభాగం డీఈ హనుమాన్ మంగళవారం పరిశీలించారు.