రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టు

తెలంగాణ రాష్ర్టానికి కచ్చితంగా ఒక జాతీయ ప్రాజెక్టును ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు హామీ ఇచ్చారు. అందుకు తగిన ప్రతిపాదనలు, ప్రాజెక్టు సమగ్ర నివేదిక, ఇతర వివరాలను సమర్పించాల్సిందిగా సూచించారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టు అవసరమని ఆమె అన్నారు. పూర్తిగా కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జాతీయ ప్రాజెక్టును ఇచ్చిన తరహాలోనే తెలంగాణకు కూడా ఒకటి మంజూరు చేస్తామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు వివరాలను కూడా ఆమె కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు.

KCR wiith union miniter uma bharti01

-ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి ఉమాభారతి హామీ
-మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు రానున్న ఉమ
-ఏఐబీపీ నిధుల విడుదలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి
-పొరుగు రాష్ర్టాలతో వివాదాల్లేని ప్రాజెక్టులపై వివరణ
-ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో చర్చ
-సీఎం ఢిల్లీ టూర్ సక్సెస్.. హైదరాబాద్ చేరిన కేసీఆర్
కేంద్ర జలసంఘం చేసిన సూచనలను, దానికి అనుగుణంగా తయారవుతున్న డిజైన్ గురించి కూడా ఆరా తీశారు. రాష్ర్టానికి సంబంధించి పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించీ, కేంద్రంనుంచి ఏఐబీపీ పథకంకింద రావాల్సిన నిధుల గురించీ ఆమెకు వివరించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు సూచికగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణకు రావాలని కేంద్రమంత్రిని కేసీఆర్ ఆహ్వానించగా.. తప్పకుండా వస్తానని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర అవసరాల గురించి ఉమాభారతికి వివరించిన కేసీఆర్.. ఏఐబీపీ (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్) కింద ట్రిపుల్ ఆర్ (రిపేర్, రినోవేషన్, రిస్టోరేషన్) మూడోదశ ప్రతిపాదనల్లో భాగంగా రాష్ట్రంలోని 188 చెరువుల పనులపై హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలను మార్చి 23వ తేదీన పంపారని తెలిపారు.

ఆ సిఫారసులకు అనుగుణంగా రూ.116.625 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం 188 చెరువుల పనులకు రూ.129.58 కోట్లు ఖర్చవుతున్నదని, ఇందులో కేంద్రం నుంచి రూ. 116.625 కోట్లు రావాల్సి ఉందని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు.

ఆ నాలుగు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి
హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయం ఏప్రిల్ 20న నాలుగు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించి కేంద్ర కార్యాలయానికి పంపిందని, వీటి ఆధారంగా ఈ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్‌వల్ల సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనికి సుమారు రూ.5825.81 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణవల్ల సుమారు 2.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనికి రూ.978 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులు పూర్తికావడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి రెండేండ్ల గడువు ఇవ్వాలని కూడా కోరారు. మోడికుంటవాగువల్ల సుమారు 5500 హెక్టార్లకు సాగునీరు అందుతుందని పేర్కొన్న కేసీఆర్ ఈ నాలుగు ప్రాజెక్టులకు తగిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో త్వరలో సలహా కమిటీ సమావేశం జరుగనున్నందున అప్పటిలోగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ఏఐబీపీ నిధులను విడుదల చేయండి
చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టువల్ల సుమారు 2.49 లక్షల హెక్టార్లకు సాగునీరు అందడమేకాకుండా వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని వివరించిన కేసీఆర్.. ప్రధాని సహాయ ప్యాకేజీకింద ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందినందున ఏఐబీపీ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రాజెక్టును మార్చి 2017కల్లా పూర్తి చేయాలని గతంలో ప్లానింగ్ కమిషన్ స్పష్టంచేసిందని, కానీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ.148.49 కోట్లు రాష్ర్టానికి మంజూరు చేయడానికి సిఫారసులు అందగా కేంద్రం మాత్రం రూ.133.64 కోట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొందని, అవి ఇప్పటివరకూ విడుదల కాలేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.115.25 కోట్లకు సిఫారసుల మేరకు కేంద్రం రూ.103.72 కోట్లను విడుదల చేయాల్సి ఉందని, ఇది కూడా విడుదల కాలేదని తెలిపారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.59.67 కోట్లు సిఫారసు కాగా, ఆ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ కేంద్రంనుంచి విడుదల కాలేదని తెలిపారు. ఈ విధంగా రాష్ర్టానికి మూడు ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.297.03 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వీలైనంత తొందరగా విడుదల చేయాలని కోరారు. ఈ నిధులకు హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయంతోపాటు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం, జలవనరుల శాఖలోని ఎస్పీఆర్ విభాగం, ఆర్థిక విభాగం అనుమతులు లభించాయని, నిధులను విడుదల చేయవచ్చని స్పష్టంగా పేర్కొన్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ నిధుల విడుదల కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 12న, ఆ తర్వాత గత నెల 9న ఎస్పీఆర్ విభాగం కమిషనర్‌కు లేఖలు కూడా రాసిందని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరించేందుకు రండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు పైలాన్‌ను వరంగల్‌లో ఆవిష్కరించేందుకు రావాల్సిందిగా ఉమాభారతిని కేసీఆర్ ఆహ్వానించారు. ఈ నెల 16వ తేదీలోపున వస్తానని ఆమె హామీ ఇచ్చారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర కార్యదర్శులు స్మితా సబర్వాల్, శాంతకుమారి, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు ఉన్నారు. ఈ భేటీలో జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కూడా పాల్గొన్నారు.

కేంద్రమంత్రితో సమావేశం వివరాలను అనంతరం ఎంపీ కవిత మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టానికి తప్పనిసరిగా ఒక జాతీయ ప్రాజెక్టును ఇస్తానని ఉమాభారతి హామీ ఇచ్చారని తెలిపారు. వివరాలను సమర్పించిన వెంటనే ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారని చెప్పారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు కూడా ట్రిపుల్ ఆర్ పథకం కింద 50% ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేయగా ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రమైన డిజైన్ పనులపై చర్చలు జరుగుతూ ఉన్నాయని, ఇంకా పూర్తి కాలేదని కవిత అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ పనులు జరుగుతున్నాయి కనుక పొరుగు రాష్ర్టాలతో ఎలాంటి జల వివాదం లేని డిజైన్‌ను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. మహారాష్ట్రతో భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే డిజైన్ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సీఎం టూర్ సక్సెస్: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. బుధవారంరాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం.. గురువారం కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌ను కలిసి, కొత్త సచివాలయం నిర్మించుకునేందుకు సికింద్రాబాద్‌లోని బైసన్ గ్రౌండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. ఆయన పరిశీలన నిమిత్త తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్‌లో సైనిక్ స్కూలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా.. వీలును బట్టి మరోటి కూడా ఇస్తామని పారికర్ హామీ ఇచ్చారు. అదే విధంగా హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినప్పుడు పోలీసు శాఖ ఆధునికీకరణకు కేంద్రం ఆర్థిక సహకారంతోపాటు, అధునాతన సాంకేతిక పరికరాలు అందించి ఉగ్రవాదం, తీవ్రవాదంపై జరుపుతున్న పోరులో రాష్ర్టానికి అండగా ఉండాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా, శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసిన సీఎం కేసీఆర్.. రాష్ర్టానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. రాష్ర్టానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను సైతం నేరుగా మంత్రి దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లగలిగారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సీఎం.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.