రాష్ట్రంలో అంబానీ పెట్టుబడులు!

-విద్యుత్, మౌలిక వసతులు, పారిశ్రామిక, మీడియా రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిద్ధమని ప్రకటన
-సీఎం కేసీఆర్‌తో అనిల్ అంబానీ భేటీ.. నూతన రాష్ట్రం సాధించినందుకు అభినందన
-పునర్నిర్మాణంలో తమ సహకారముంటుందని హామీ
-పరస్పర సహకారంతో ముందుకెళ్దామంటూ స్వాగతించిన కేసీఆర్

KCR-001

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అంబానీ గ్రూప్స్ ప్రకటించింది. సహజ వనరులు విస్తృతంగా ఉన్న రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. తొలి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్స్ చైర్మన్ అనిల్ అంబానీ అభినందించారు.

సోమవారం అనీల్ అంబానీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, మీడియా రంగాల్లోవిస్తృతంగాపెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.తన తండ్రి ధీరూభాయ్ అంబానీ కూడా కిందిస్థాయి నుంచి కష్టపడి పైకెదిగినట్లు చెప్పారు. అలాగే కేసీఆర్ కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ర్టాన్ని సాధించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనే అంశంపై సమగ్ర ప్రణాళిక తయారుచేయడంలో తాము నిమగ్నమైనట్లు అంబానీకి సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్దికి అవసరమైన నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అది పూర్తయిన తర్వాత మరోసారి చర్చలు జరిపి పరస్పర సహకారంతో ముందుకెళ్దామని అంబానీకి సూచించారు. పెట్టుబడులకు అనుకూలమైన పాలసీని అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అనిల్‌అంబానీ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు కూడా ఉన్నారు.