రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి

రాష్ట్రాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుత దేశ, కాలమాన పరిస్థితుల్లో ప్లానింగ్ కమిషన్ తన ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు. దీని స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా చొరవ తీసుకుని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి, వారి అభిప్రాయాలను తీసుకోవడం హర్షించదగినదని కొనియాడారు.

CM KCR with PM Narendara Modi

-ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్.. ఏకీభవించిన ప్రధాని నరేంద్రమోదీ
-నాలుగు టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు యోచన.. ఒక టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా కేసీఆర్!
-ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థకు సంపూర్ణ ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి
-టీమ్ ఇండియా స్ఫూర్తికి అభినందనలు
-మన ఊరు-మన ప్రణాళిక పేరుతో తెలంగాణలో ప్రణాళికలు రచించాం: కేసీఆర్
-సహకార సమాఖ్యవాదం కీలకం
-అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి
-దీర్ఘకాల ప్రణాళికా రచన ఉండాలి
-కొత్త వ్యవస్థ తారతమ్యాలను పారదోలాలి
-నీతి ఆయోగ్ పేరిట కొత్త వ్యవస్థ
-జనవరి 26న ఆవిర్భావం!
-టీమ్ ఇండియాలా కొత్త వ్యవస్థ
-అమలులో సీఎంల భాగస్వామ్యం
-సీఎంలు మంచి సూచనలిచ్చారు
-ముఖ్యమంత్రుల భేటీలో మోదీ
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న కేసీఆర్ అభిప్రాయంతో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఏకీభవించారు. ప్రధాని అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అధికారులతో టీమ్ ఇండియా స్ఫూర్తితో ఏర్పాటుచేయనున్న కొత్త వ్యవస్థను స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో నక్సల్స్ హింసవంటి అంశాలపై ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటు ప్రతిపాదనపై కూడా ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఇలాంటి సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రధాని మోదీని కేసీఆర్ అభినందించారు.

ప్రణాళికాసంఘం స్థానంలో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త వ్యవస్థకు నీతి ఆయోగ్ (విధాన సంఘం) పేరు ఖరారుచేసినట్లు తెలుస్తున్నది. దీనిని వచ్చే ఏడాది జనవరి 26 రిపబ్లిక్‌డే సందర్భంగా నెలకొల్పనున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థలో మూడు లేదా నాలుగు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. ఇందులో ఒక టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా సీఎం కేసీఆర్ ఉంటారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

ఆరు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ప్రణాళికాసంఘం స్థానంలో నూతన వ్యవస్థను తీసుకువస్తామని మోదీ గతంలోనే ప్రకటించారు. ఇదే విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రులంతా వారివారి అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే..ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. దేశ ఆర్థిక ఎజెండాను రూపొందించడానికి ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం, ప్రధాని అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టీమ్ ఇండియా అనే ఆలోచన చేయడం ఆహ్వానించదగినది. ప్రధాని తీసుకున్న అపూర్వమైన ఈ చొరవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేశ అభివృద్ధి వివిధ రాష్ట్రాల అభివృద్ధితో ముడిపడి ఉంది.

రాష్ట్రాలు బలహీనంగా ఉంటే దేశం పటిష్ఠంగా ఉండజాలదు. జాతీయ విధానాల రూపకల్పనలో ఇప్పటివరకూ రాష్ట్రాలకు వాటివాటి అభిప్రాయాలను వెల్లడించడానికి తగిన వేదిక లేదా ప్రాతినిథ్యం లేదు. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ప్రాణం పోసుకునే వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం కల్పించాలి. దీంతో కో ఆపరేటివ్ ఫెడరలిజం స్థాపనకు అవకాశం కలుగుతుంది. దేశం మొత్తానికి సంబంధించిన సాధారణమైన, కీలకమైన ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాని చైర్మన్‌గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల భాగస్వామ్యంతో విడిగా టీమ్ ఇండియా మండలి ఏర్పాటు ఆలోచన జరుగుతున్నది.

ఆయా రాష్ట్రాలు లేదా కొన్ని రాష్ట్రాలతో కూడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి కాబట్టి, వాటిని ఉప గ్రూపులుగా విభజించి చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. గంగా యాక్షన్ ప్లాన్, వామపక్ష తీవ్రవాదం లాంటి అంశాలు కొన్ని రాష్ట్రాలతో ప్రాంతానికి ముడిపడి ఉంటాయి కాబట్టి అలాంటి అంశాల్లో ఉప గ్రూపుల ఏర్పాటు అవసరం.

శాశ్వత సచివాలయం ఏర్పాటు చేయాలి: టీమ్ ఇండియాకు సహాయకారిగా అన్ని ఆలోచనల్లో, చర్చల్లో అన్ని రాష్ట్రాలు సభ్యులుగా ఉండే శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు అవసరం. విధానపరమైన నిర్ణయాలకు అవసరమైన అంశాలను ఈ సెక్రటేరియట్ తీసుకోవడంతోపాటు.. థింక్ టాంక్ (మేధావుల బృందం)గా ఉండే మేధావులను భాగస్వాములను చేయాలి. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఈ సెక్రటేరియట్‌కు ముందుగానే తెలియజేస్తే చర్చల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ప్రధాని చైర్మన్‌గానూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగానూ ఉండే టీమ్ ఇండియా స్థూలంగా మన దేశానికి, అన్ని రాష్ట్రాలకు అవసరమైన దీర్ఘకాల ప్రణాళికలను కనీసంగా పది సంవత్సరాల వ్యవధికి రూపొందించాలి.

ఇప్పుడున్న పంచవర్ష ప్రణాళిక స్వల్పకాల, మధ్యకాల ప్రణాళికలకు మాత్రమే పరిమితవుతున్నది. ఒకట్రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే పంచవర్ష ప్రణాళిక సిద్ధమవుతున్నది. వివిధ రంగాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన అంశాలు ఉంటున్నాయి. రాష్ర్టాలు వాటి ప్రణాళికలను రూపొందించుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఇందుకోసం పర్‌స్పెక్టివ్ ప్లాన్ ఉండాలి. ఇలాంటి కార్యాచరణ ప్రణాళికలు కనీసంగా మూడు నుంచి ఐదేండ్ల కాలవ్యవధికి తగినట్లుగా ప్రతి ఏటా బడ్జెట్ ఉండేలా చూడాలి.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి: సమతుల్యమైన అభివృద్ధికి ఎంతగా కృషి చేస్తున్నా వివిధ రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ, అంతరాలు, అసమానతలు ఉంటున్నాయి. రాష్ట్రాల మధ్యనే కాకుండా రాష్ట్రం లోపలే వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఉంటున్నాయి. ఇన్నాళ్ళూ ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ స్థానంలో వస్తున్న కొత్త వ్యవస్థ భిన్నమైన వాతావరణాన్ని కల్పించి, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి చేరేలా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రాల వార్షిక ప్రణాళిక రూపకల్పనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో రాష్ర్టాలు చర్చించే విధానానికి స్వస్తి పలకాలి.

జాతి నిర్మాణంలో ప్రైవేటు రంగానికి కూడా తగిన ప్రాతినిథ్యం ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు సంస్థలకు చెందినవి నాల్గింట మూడొంతులు ఉంటున్నాయి. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధగా, తోడ్పాటుగా ప్రైవేటు సంస్థలు ఉండేలా తగిన వాతావరణం కల్పించాలి. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా వికేంద్రీకరణ ప్లానింగ్‌లో రాష్ట్రాలకు సైతం తగిన అవకాశం ఉండేలా దీర్ఘకాల ప్రణాళికా రచన ఉండాలి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రతి గడపకూ చేరేలా మన ఊరు – మన ప్రణాళిక, మన మండలం – మన ప్రణాళిక, మన జిల్లా – మన ప్రణాళిక, మన రాష్ట్రం – మన ప్రణాళిక అనే పేర్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ దృక్పథం ద్వారా ప్లానింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు ప్రజాస్వామిక స్వభావాన్ని సంతరించుకోడానికి దోహదపడుతుంది.

మేధావుల పాత్ర ప్రధానమైనది: ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నూతనంగా ఉనికిలోకి రానున్న వ్యవస్థలో థింక్ టాంక్ పాత్ర చాలా ప్రధానమైనది. ప్రతి విధాన, కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేస్తూ నిర్దిష్టంగా ఆయా విధాన నిర్ణయం పర్యవసానాలను విశ్లేషించాలి. టీమ్ ఇండియా తీసుకునే నిర్ణయాల్లో థింక్ టాంక్ అందించే సూచనలు, గణాంకాలు ప్రాధాన్యంతో కూడుకున్నవి. ఒక రకంగా దీని పాత్ర ఫిలాసఫర్‌గానూ, స్నేహితుడిగానూ, మార్గదర్శకుడిగానూ ఉండాలి.

ఇలాంటి పాత్ర పోషించే థింక్ టాంక్‌లో వివిధ అంశాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులు ఉండాలి. అవసరాన్ని బట్టి మన దేశం వెలుపల ఉండేవారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాలి. పరిస్థితులను బట్టి గ్లోబల్ థింక్‌టాంక్‌లతోనూ సంబంధాలను పెట్టుకోవాలి. ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటిని ఇతర రాష్ట్రాలకూ అక్కడి స్థానిక అవకాశాలను బట్టి అమలు చేసే సాధ్యాసాధ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి రాష్ర్టాలకు వినూత్న ఆలోచనలను కూడా అందించాలి.

పక్షపాతానికి తావులేని వ్యవస్థ ఉండాలి: ప్లానింగ్ కమిషన్ స్థానంలో నూతన వ్యవస్థ ఉనికిలోకి వస్తున్నది కాబట్టి, కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులన్నీ కూడా ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఉండాలి. ఇన్నాళ్లూ ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపులో ఉన్న తారతమ్యాలను పారదోలేదిగా కొత్త వ్యవస్థ ఉండాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా పక్షపాతానికి తావు లేదు కాబట్టి ఆ స్ఫూర్తిని పాటించాలి. ఆర్థిక సంఘం చేసే సిఫారసులన్నీ పారదర్శకంగానూ, నిర్దిష్టమైన ఫార్ములాకు అనుగుణంగానూ.. సమ అభివృద్ధి ప్రాతిపదికగా ఉండాలి.

ఆరు దశాబ్దాలుగా అమలులో ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకురావడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం ఏర్పాటు చేయడం, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం సంతోషకరం. బలమైన దేశాన్ని నిర్మించడానికి ప్రధాని తీసుకున్న చొరవకు తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. దేశాభివృద్ధిలో రాష్ట్రాలను కూడా సమాన భాగస్వాములుగా చేయాలన్న ప్రధాని కృషి కచ్చితంగా రాష్ట్రాలను, యావత్తు దేశాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతుంది.