రండి.. సర్కారు ఏర్పాటు చేయండి

-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు గవర్నర్ ఆహ్వానం
-గురువారం అందిన అధికారిక లేఖ
-ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న కేసీఆర్
-ముహూర్తం:జూన్ 2, ఉదయం 8.15 గం.కు
-పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ ఉత్సవాలు
-పోలీసు వందనం స్వీకరించనున్న కొత్త సీఎం
-జూన్ 1 అర్ధరాత్రినుంచే ఉత్సవాలకు టీఆర్‌ఎస్ సిద్ధం

KCR 30-05-14నూతనంగా ఆవిర్భవించే తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గవర్నర్ ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పంపిన అధికారిక లేఖ కేసీఆర్‌కు గురువారం అందింది. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే కాబట్టి అదేరోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ అందులో కోరారు. ఈ మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2వ తేదీ ఉదయం 8.15 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యాన్ని సాధించింది. పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న నేపథ్యంలో గవర్నర్ ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన తరువాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ అధికారికంగా పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలో అడుగుపెడతారు. అక్కడ నల్లపోచమ్మ గుడిలో పూజల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.

governerగవర్నర్‌గా నరసింహన్ అదే రోజు ప్రమాణం..: తెలంగాణ రాష్ర్టానికి గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ జూన్ 2వ తేదీ ఉదయం 6.30 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయన తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.

రాష్ర్టావతరణ వేడుకలకు ఏర్పాట్లు..
తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ ప్రసాదరావు గురువారం మీడియాకు చెప్పారు. జూన్ రెండున ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఉదయం 10.30 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారిక వేడుకలు జరుగుతాయని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ నిర్వహించే పరేడ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని గౌరవవందనం స్వీకరిస్తారని ఆయన తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు, ఇతర ఏర్పాట్లను సిటీ కమిషనర్ అనురాగ్ శర్మతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్ 1 అర్ధరాత్రి నుంచే వివిధ వర్గాలు వేడుకలు నిర్వహిస్తున్నారని, వీటికి భారీ స్థాయిలో బందోబస్తు, భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఉత్సవాలకు టీఆర్‌ఎస్ సన్నాహాలు
రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవానికి గులాబీ పార్టీ ఉరకలేస్తోంది. జూన్ 2న తెలంగాణ పది జిల్లాలలోని ప్రధాన కూడళ్లలో గులాబీ మయం చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. జూన్ 1 అర్థరాత్రి పెద్ద ఎత్తున అరగంట సేపు బాణ సంచాలతో మోతలతో హోరెత్తించాలని నాయకులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తారాజువ్వలు తయారు చేయించారు. అవి ఆకాశంలోకి ఎగిరి రంగులు విరజిమ్మనున్నాయి. అలాగే పార్టీ కార్యకర్తలు నెక్లెస్ రోడ్డును వివిధ రకాల విద్యుత్ దీపాలతో రంగుల మయం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో వేల సంఖ్యలో హోర్డింగ్‌లు, దాదాపు 50 వేల వరకు వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రతి కూడలిని గులాబీ తోరణాల మయం చేయాలన్నది నాయకుల యోచన. ఏ జిల్లాకు ఆ జిల్లాగా పార్టీ శ్రేణులు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో రాజ్‌భవన్, తెలంగాణ భవన్, కేసీఆర్ నివాసం వద్ద సంబురాలకు ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 2న ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలను కూడా ఎగరవేయాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.