రాజధానికి కృష్ణ..మెదక్‌కు మంజీర జలాలు

-మెతుకుసీమకు పూర్వవైభవం తీసుకొద్దాం..
-స్వాతంత్ర వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పిలుపు

Harish Rao
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిచే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ప్రస్తుతం సింగూరు నీళ్లు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి.
కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగించుకునే ఆలోచన ఉంది. అప్పుడు సింగూరు నీళ్లు జిల్లాకు వాడుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఫర్ తెలంగాణ పథకానికి సిద్దపేట స్ఫూర్తి. సిద్దిపేట తరహాలో జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచినీళ్లు రప్పిస్తాం. గొలుసుకట్టు చెరువులు, వాగులపై చెక్‌డ్యాములు నిర్మించి నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తాం అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశా రు.

పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పరేడ్ మైదానంలో జాతీయజెండా ఎగురవేసి ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మెతుకుసీమ మహోజ్వల పాత్ర పోషించింది. ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. నాటి నుంచి తెలంగాణ సాధించుకునే వరకు జిల్లా ప్రజలు ఉద్యమానికి అండగా నిలిచారు. రేపటి బంగారు తెలంగాణ పునర్మిర్మాణంలో కూడా అదే స్ఫూర్తి ప్రదర్శించాలి. తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌కు, నాకు జిల్లా అం డగా నిలిచింది. జిల్లా ప్రజలతో మాది జన్మజన్మల బంధం. పుట్టిన నేలరుణం తీర్చుకునే సువర్ణావకాశం వచ్చింది.

మెతుకుసీమకు పూర్వవైభవం తీసుకొద్దాం. బంగారు తెలంగాణ నిర్మించుకుందాంఅని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించుకోవడంతోనే పనిపూర్తికాలేదని, మెదక్ జిల్లా ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు యావత్‌దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. మ్యానిఫెస్టోలో మాట ఇచ్చినట్లుగానే రుణమాఫీతోపాటు అనేక హమీలను నెరవేరుస్తున్నామని వివరించారు.