రైతులకు ప్రభుత్వం అండ

– పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
– మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి
– తక్షణమే పరిహారం చెల్లిస్తాం: మంత్రులు ఈటల,లక్ష్మారెడ్డి
– నష్టంపై సమగ్ర సర్వే: మంత్రులు నాయిని, పట్నం
– ఆర్థికంగా ఆదుకుంటాం: మంత్రులు పోచారం, తుమ్మల

Ministers Naini Narsimha reddy and mahendar Reddy visited rain affected areas in rangareddy district

అకాల వర్షం, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో నష్టపోయిన పంటలను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.5,400 చొప్పున రెండు నెలల్లో అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 871 హెక్టార్లలో వరి పంట, 1749 హెక్టార్లలో కూరగాయల పంటలు, 749 హెక్టార్ల మామిడి పంట ఇతరత్రా పంటలు నష్టం వాటిల్లిందన్నారు.
గత ప్రభుత్వాలు 50 శాతం పంట నష్టపోతే ఆర్థిక సహాయం అందించేవని, కానీ తమ ప్రభుత్వం 33 శాతం నష్టపోయినా పరిహారం అందిస్తుందన్నారు. విపత్తులతో ఎవరైనా మరణిస్తే రూ. 5 లక్షలు, బర్రెలు, ఆవులు మరణిస్తే రూ.30 వేల చొప్పున, ఎడ్లు మరణిస్తే రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ నిర్ణయించారని వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో కుర్తివాడలోనే 300 ఎకరాల పంట నాశనం కావడం భాదాకరమన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పంచదేవుపహాడ్‌లో దెబ్బతిన్న వరి పంటను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి, తక్షణమే నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి ఈటల అన్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్నదాతలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలన్నారు.

Ministers etela Rajendar and Laxma Reddy visited rain affected areas in Mahabubnagar district

రంగారెడ్డి జిల్లాలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి,రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులు సమగ్ర సర్వే నివేదిక ఇవ్వగానే నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్, సిరికొండ మండలాల్లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, షకీల్ మహమ్మద్, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలో బుధవారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి దెబ్బతిన్నది. శాలరామన్నపల్లి, బొజ్జపల్లి, మారుపాకల్లో దాదాపు 120 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.