రైతులకు అండగా ఉండండి

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం కరీంనగర్ వెళుతూ దారిలో మెదక్ జిల్లా ఎర్రవెల్లి,నర్సన్నపేట తదితర గ్రామాల్లో ఆగి రైతులతో మాట్లాడారు. వర్షాలు ఎట్లా పడుతున్నాయి.. ఏ పంటలు వేస్తున్నారు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరిపడా దొరుకుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇతర అధికారులతో సీఎం మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌కు వర్షాలు మంచి ఆరంభం ఇచ్చాయన్నారు. చాలా చోట్ల రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారన్నారు.

CM KCR with Karimnagar distrcit officaials

-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యంలో రైతులకు సీఎం పలకరింపు
-నేడు వేములవాడ రాజన్న దర్శనం
వాళ్లకు కావాల్సిన విత్తనాలు అందించాలని, ఎరువులు, మందుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతుల అవసరాలేమిటో తెలుసుకొని తీర్చాలన్నారు. జిల్లా స్థాయిలో తీర్చడం సాధ్యం కాకుంటే ప్రభుత్వపరంగా సాయం అందిద్దామని చెప్పారు. నర్సన్నపేట గ్రామ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు.

-సీఎం అయ్యాక తొలిసారిగా వేములవాడకు..!
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి కరీంనగర్‌కు చేరుకున్నారు. పార్టీ జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు.సీఎం గురువారం ఉదయం వేములవాడకు వెళ్లి శ్రీ రాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుంటారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వేములవాడకు వస్తున్న ఆయనకు ఘనస్వాగతం తెలిపేందుకు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ నీతూకుమారి , ఎస్పీ జోయల్‌డేవిస్, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనుల సమీక్ష అనంతరం సీఎం పార్టీ సమావేశంలో పాల్గొంటారు.

-30న రోడ్ సేఫ్టీపై సీఎం సమీక్ష
రోడ్ సేఫ్టీ డ్రాఫ్ట్ పాలసీపై ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ఆర్ అండ్ బీ, పోలీసు, హెల్త్ అండ్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమవుతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్తచట్టంపై కూడా చర్చిస్తారు. సమీక్ష సమావేశం కోసం ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులు ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారాన్ని పొందుపరిచి ముఖ్యమంత్రి పేషీకి పంపించినట్లు సమాచారం.