రైతుకు మద్దతు

-ఈ ఏడాది నుంచి అన్నదాతకు ప్రత్యేక బడ్జెట్
-మార్కెట్‌లో మద్దతుధర రాకుంటే ప్రభుత్వమే కొనాలి
-మద్దతుధరల విషయంలో కేంద్రంపై ఒత్తిడి
-వరికి, మక్కలకు రూ.2 వేల మద్దతుధర కావాలని కోరుతాం
-ఇతర రాష్ర్టాల్లో మద్దతుధరల అధ్యయనానికి హరీశ్ నేతృత్వంలో బృందం
-వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం ఈ ఏడాది నుంచే అమలు
-మే 15 నాటికి మొదటి విడుతగా ఎకరానికి రూ.4 వేల చెల్లింపు
-అమలుపై పోచారం అధ్యక్షతన కమిటీ
-మొదటిదశ భూరికార్డుల ప్రక్షాళన దిగ్విజయంగా పూర్తి
-వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్

రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతుధర రాకుంటే ప్రభుత్వమే నేరుగా కొనుగోలుచేసే విధానం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి శుక్రవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటుంది. అందుకే రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి, పండించిన ప్రతిగింజకూ మద్దతుధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్నారు.

సమైక్యరాష్ట్రంలో మన రైతాంగం నష్టపోయింది
సమైక్యరాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని, అందువల్ల రైతాంగం నష్టపోయిందని సీఎం అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిచేయడం కోసం ఇప్పటికే అనేకచర్యలు తీసుకున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. చెరువులు పునరుద్ధరించాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం. గోదాములు నిర్మించాం. ఎకరానికి ఏడాదికి రూ.8 వేల పెట్టుబడిని ఈ ఏడాది నుంచే అందిస్తున్నాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. రైతులను సంఘటితశక్తిగా మార్చాం. వ్యవసాయ యూనివర్సిటీని బలోపేతంచేశాం. భూరికార్డుల ప్రక్షాళనద్వారా వ్యవసాయభూముల యాజమాన్యం విషయంలో స్పష్టత వచ్చింది. వీటితోపాటు రైతులు పండించిన పంటకు మద్దతుధర లక్ష్యంగా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తుంది అని తెలిపారు.

రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలి
ఆర్థికవేత్తలు ఏంచెప్పినా.. ఎక్కువమంది ఆధారపడిన ప్రధానరంగం వ్యవసాయమేనని, రాష్ట్రంలో 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారని సీఎం అన్నారు. వ్యవసాయదారులు తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయి తమనెవరూ పట్టించుకోరు అనే భావనలో ఉన్నారని, తమ ఖర్మ ఇంతే అనుకుంటున్న రైతుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వారికి చేయూత అందించి, అండగా నిలువాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కొంతమార్పు వచ్చిందని తెలిపారు. రైతులకు మేలు జరుగుతున్నది. అంతిమంగా రైతులు పండించిన పంటకు మంచి ధర రావాలి. అది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతుధర వచ్చేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో అత్యంత పట్టుదలతో, కృతనిశ్చయంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వరి, మక్కల లాంటి దిగుబడులకు ప్రస్తుతం కనీస మద్దతుధర లభిస్తున్నది. పత్తిలాంటి ఇతర పంటలకు మద్దతుధర విషయంలో అనిశ్చితి నెలకొంటున్నది.

అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్రప్రభుత్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయి. సీసీఐ లాంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించే వ్యూహం రూపొందించాలి. రైతు సమన్వయ సమితుల ద్వారా ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, తిరిగి అమ్మాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా నష్టం వస్తేకూడా ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట మార్కెట్‌నెట్‌లోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. వివిధ రాష్ర్టాల్లో వివిధ పంటలకు మద్దతుధర ఇచ్చే విషయంలో ఎలాంటి విధానం పాటిస్తున్నారో అధ్యయనం చేయడానికి అధికారులు మహారాష్ట్ర, కర్ణాటకలాంటి రాష్ర్టాల్లో పర్యటించాలి. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో అధికారుల బృందం దేశవ్యాప్తంగా మద్దతుధరలకు సంబంధించిన విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రైతులకు మద్దతుధర వచ్చే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుంది. వరిధాన్యం, మక్కలు, పసుపు వంటి సంప్రదాయ పంటలే కాకుండా.. పసుపు, మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలకు, మామిడి, నిమ్మ, బత్తాయి వంటి పండ్లకుకూడా మంచిధర రావాలన్నదే మా లక్ష్యం. అందుకనుగుణంగానే ప్రభుత్వ విధానం ఉంటుంది అని సీఎం స్పష్టం చేశారు.

వ్యవసాయానికి ఈ ఏడాది నుంచి ప్రత్యేక బడ్జెట్
రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టంచేశారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతామని ప్రకటించారు. రైతులకు పెట్టుబడిగా అందించే నిధులతోపాటు మద్దతు అందించడం కోసం కొంత నిధిని కూడా బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికయ్యే ఖర్చును ముందే అంచనావేసి, బడ్జెట్‌లో పొందుపరుస్తామని, దీనివల్ల నిధుల సమస్య రాదని సీఎం వెల్లడించారు.

కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి
మద్దతుధర విషయంలో కేంద్రంకూడా మరింత ఉదారంగా వ్యవహరించాల్సి ఉంది. వరి, మక్కలకు మద్దతుధర పెరుగాల్సి ఉంది. ఈ రెండింటికీ రూ.2 వేల మద్దతుధర ప్రకటించాలి. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అసలు మద్దతుధరే లేదు. కాబట్టి దేశంలో పండే ప్రతి పంటకు మద్దతుధర ప్రకటించేలా కేంద్ర విధానం ఉండాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రంతో మాట్లాడుతాం. టీఆర్‌ఎస్ తరఫున పార్లమెంట్‌లోకూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం అని సీఎం చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం (ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ స్కీం) ఈ ఏడాది నుంచే అమలవుతుందని కేసీఆర్ ప్రకటించారు. మే 15 నాటికి మొదటివిడుతగా ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడిని రైతులకు అందిస్తామన్నారు. వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ఎలా అమలుచేయాలి? రైతులకు డబ్బులు నేరుగా అందివ్వాలా? బ్యాంకుల ద్వారా అందివ్వాలా? సాగుచేస్తున్న భూములను గుర్తించడం ఎలా? ఏ ప్రాతిపదికన పెట్టుబడి అందించాలి? తదితర అంశాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, టీ హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.

ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ సుభాష్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, సీసీఎల్‌ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు, సిబ్బందికి సీఎం ప్రశంసలు
-రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించే విషయంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాయకత్వంలో అధికారులు విశేషకృషి చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు.
-పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తిచేయడానికి కృషిచేస్తున్న నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును, అధికారులను సీఎం ప్రశంసించారు.
-తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌రంగంలో అత్యుత్తమ సేవలందించి కేంద్రప్రభుత్వం ద్వారా సీబీఐపీ అవార్డు అందుకున్న జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావును సీఎం అభినందించారు.

-మొదటిదశ భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో 71,75,096 వ్యవసాయ ఖాతాలు, 1,42,12,826.17 ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్నట్టు లెక్కతేలిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసిన డైరెక్టర్ వాకాటి కరుణ, రెవెన్యూ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, సిబ్బందిని సీఎం అభినందించారు.
-వీలైనంత త్వరలో రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందివ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఇప్పటినుంచి భూముల క్రయ, విక్రయాలు జరిగిన వెంటనే ఆ వివరాలు రాష్ట్ర అధికారుల వద్ద కూడా నమోదు కావాలన్నారు. భూముల మ్యుటేషన్ అధికారం కూడా తహసీల్దార్లకే అప్పగిస్తున్నామని, ఇక ఆర్డీవోల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.
-రాష్ట్రంలో వినియోగించే ఆహార పదార్థాలు ఎన్నిరకాలనే విషయమై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని, దానికి అనుగుణంగా క్రాప్ కాలనీలు నిర్ధారించి, రైతులకు అవగాహన కల్పిస్తామని సీఎం తెలిపారు. మంచి మార్కెట్ ఉన్న పంటలను, నాణ్యమైన రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా రైతులను కోరుతామని చెప్పారు.
-కల్తీ విత్తనాలను అరికట్టడంలో గతఏడాది ఎంతో కృషి జరిగిందని, ప్రభుత్వం పీడీ యాక్టు కూడా తెచ్చిందని, ఈ ఏడాది కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులను కోరారు. విత్తనాల తయారీదారులు, అమ్మకందారుల వివరాలు, ఫొటోలు ముందే సేకరించి పెట్టుకోవాలని, ఎక్కడ ఏ పొరపాటు జరిగినా వెంటనే స్పందించాలని సూచించారు.

-ఎరువుల కొరత రాకుండా ముందే స్టాక్ పెట్టుకున్నారని, అయినప్పటికీ ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం కోరారు.
-మార్కెటింగ్‌శాఖ కొత్తగా గోదాములను నిర్మిస్తున్నదని, దీంతో 22.50 లక్షల టన్నుల నిల్వసామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వస్తాయని సీఎం అన్నారు. వేర్‌హౌజింగ్, ఎఫ్‌సీఐ గోదాములు కూడా కలిపిచూస్తే రాష్ట్రంలో 53 లక్షల టన్నుల నిల్వసామర్థ్యం ఉంటుందని, వీటిని ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని సీఎం చెప్పారు.
-పంటలకు చీడపీడలు రాకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయ విస్తరణాధికారులు రైతులను చైతన్యపర్చాలని సీఎం కోరారు.
-రాష్ట్రంలోని ఏ ఎకరంలో ఏ పంట వేశారనే లెక్కలు వ్యవసాయశాఖ వద్ద ఉండాలని, రెవెన్యూశాఖపై ఆధారపడకుండా వ్యవసాయ విస్తరణాధికారులతో సమాచారం తెప్పించుకోవాలని సీఎం కోరారు.