రైతు సంక్షేమంలో రాష్ట్రందిక్సూచి

-గుంట భూమి ఉన్నరైతుకు కూడా బీమా
-ఎన్ని పాస్‌బుక్ ఖాతాలున్నా ఒక్కటే బీమా
-పాస్‌పుస్తకాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం
-దేశానికి దిక్సూచిలా రైతుబంధు.. బీమా పథకాలు
-కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నా.. నేతలకు కడుపు మంట
-తెలంగాణలో ఇప్పుడున్నది రైతు రాజ్యం
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి

రైతు సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు, తాజాగా రైతుబీమా పథకాలు వినూత్నమైనవని, దేశంలో ఈ తరహా పథకాలు లేవని అన్నారు. దేశం యావత్తు తెలంగాణవైపు చూస్తున్నదని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో రైతులు తెలంగాణ మోడల్‌గా తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకం జిల్లాస్థాయి అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్న ఆయన నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ వివరాలు..

ఒక్క గుంట భూమి ఉన్నా బీమా వర్తిస్తుంది
భూమి ఉండి, వ్యవసాయం చేస్తున్న 18-59 ఏండ్ల మధ్య వయసున్న ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. గుంట భూమి ఉన్నా అర్హులే. బీమా పథకంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తుచేశారు. ప్రతీ రైతు పక్షాన ప్రభుత్వం ఏడాదికి రూ.2271 ప్రీమియం రూపంలో ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. ప్రతీ ఏడాది ఆగస్టు 15 కల్లా అర్హులైన రైతులకు ఎల్‌ఐసీ నేరుగా బాండ్లను పంపిస్తుంది. జీవిత బీమా పాలసీ కావడంతో ప్రతీ ఏటా రెన్యూవల్ తప్పనిసరి. అకాల మరణమైనా, సహజమరణమైనా రైతు కుటుంబానికి రూ.5లక్షలు బీమా మొత్తంగా అందుతుంది.

పదిరోజుల్లోనే బీమా క్లెయిం.. డబ్బులు ఖాతాలోకి
రైతు మరణించిన పదిరోజుల్లోనే బీమా మొత్తం రైతు నామినీలకు అందిస్తాం. నేరుగా బ్యాంకు ఖాతాలోనే సొమ్ముపడేలా ఏర్పాటుచేశాం. బీమా సంస్థ చుట్టూ తిరుగాల్సిన అవసరంలేదు. బీమాకు సంబంధించి రైతులు తమ నామినీలను పేర్కొనాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే 30 రోజుల్లోపు ఎల్‌ఐసీ పరిష్కరించేలా ఏర్పాటుచేశాం.

రైతు సమన్వయ వేదికల నిర్మాణాలు మొదలుపెడ్తాం..
రైతు సమన్వయ సమితుల మండల, జిల్లా సమన్వయకర్తల కోసం వేదికలు నిర్మించాలని నిర్ణయించాం. కొన్నిచోట్ల భూమి ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. భూమి అందుబాటులో ఉన్నచోట తక్షణమే నిర్మాణాలు ప్రారంభిస్తాం. రైతుబంధు, ఇప్పుడు బీమా పథకం అమలు విషయంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరలోనే వేదికల నిర్మాణ కార్యక్రమాన్ని చేపడ్తాం.

రైతుకు ధర వచ్చేలా చేస్తాం..
మార్కెట్‌లో రైతుకు మద్దతు ధర రాని సమయంలో రైతు సమన్వయ సమితి ద్వారా జోక్యం చేసుకుంటాం. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తాం. అలాగే, రైతులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల అమలు, క్రాప్ కాలనీల అభివృద్ధి తదితరాలపై దృష్టిసారిస్తాం. పట్టాదార్ పాస్‌పుస్తకాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నాంపార్ట్-ఏలో ఉన్నవారందరికీ పాస్‌పుస్తకాలు ఇచ్చేశాం. ముద్రణపరమైన తప్పులను సవరిస్తున్నాం. పార్ట్-బీ భూముల విషయంలో ఇప్పుడు దృష్టిసారించాం. ఆర్వోఎఫ్‌ఆర్ భూముల సమస్యను సీఎం పరిష్కరించారు. పోడువ్యవసాయం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం
దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో రైతులు ఆందోళనబాటపట్టారు. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితిలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసినన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇది దేశంలో పెనుమార్పు తెచ్చే పథకం అవుతుంది. ఒక రైతుకు రెండుమూడు ఖాతాలున్నా ఒకే బీమా వస్తుంది. ఆధార్‌తో అనుసంధానిస్తాం. ఎన్నిచోట్ల భూమి ఉన్నా.. ఒకే బీమా పాలసీ వస్తుంది.

98 శాతం చిన్న రైతులే.. ప్రతిపక్షాలవి గాలిమాటలు
రైతుబంధు, రైతుబీమా పథకాలు అందుకుంటున్నవారిలో 98% పేద, చిన్న రైతులే. ప్రభుత్వంపై ఏం విమర్శలు చేయాలో తెలియక ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి. వాళ్లవి గాలిమాటలు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే రైతులు ఊరుకోరు. మా లక్ష్యం రైతులను రాజుగా చేయ్యడమే. రైతు రాజ్యం మా నినాదం. తెలంగాణలో ఇప్పుడున్నది రైతు రాజ్యమే. మా ముఖ్యమంత్రి స్వయంగా రైతు. మా వ్యవసాయశాఖ మంత్రి రైతు. నేనూ రైతునే. రైతులపై మాకున్న అవగాహన ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడున్నది?