రైతుకోసమా? రాజకీయం కోసమా?

– రాహుల్‌గాంధీ రాకను ప్రశ్నించిన మంత్రి హరీశ్‌రావు
– రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ విధానాలే కారణం

Harish Rao press meet on Rahul gandhi visit to telangana

రైతుల సమస్యలపై ఎప్పుడూ దృష్టిపెట్టని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ర్టానికి రావడంలో తప్పు లేదు. కానీ రైతులకు క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీష్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సచివాలయంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో మొదటి ముద్దాయిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలముందు నిలబడి ఉందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1998 నుంచి 2004 వరకు తెలంగాణలో 1877 మంది ఆంధ్రలో 1550 మంది రైతులు మరణించారని, 2004లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో 1887 మంది, ఆంధ్రలో 1550 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పపడ్డారని ఆయన తెలిపారు.

రైతుల కోసం కాకుండా కేవలం రాజకీయ లబ్ధికోసమే వస్తున్నారన్న విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తిస్తారని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. విద్యుత్ సరఫరా, కల్తీ ఎరువులు, పురుగుల మందులు, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలు కురువడమనే కారణాల వల్ల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోయిందన్నారు. 2009లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చిందా అని నిలదీశారు.

తెలంగాణకు న్యాయబద్దంగా రావల్సిన నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, పులిచింతల లాంటి అక్రమ ప్రాజెక్టులకు నీటిని మళ్ళించి కాంగ్రెస్ నేతలు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను ఎడారిగా మార్చారని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం, నక్కలగండి నిర్మాణం కోసం కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించలేదో జవాబు చెప్పాలన్నారు. తెలంగాణలో నీలం తుఫాన్ వచ్చినప్పుడు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ఒక్క రూపాయి ఇవ్వని విషయంపై అప్పటి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు.

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
కాంగెస్ చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ ద్రోహాన్ని గుర్తించి తమ ప్రభుత్వం రూ.475 కోట్లు కేటాయించి రైతాంగాన్ని ఆదుకున్నదని హరీశ్‌రావు అన్నారు. 46 వేల చెరువులని ప్రణాళికాబద్దంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు చెరువుల పూడిక తీస్తున్న భాద్యతగల ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. హైదరాబాద్ మొదలుకొని రాష్ట్ర మారుమూల ప్రాంతాల వరకు విద్యుత్‌కోతలు లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. 100 శాతం సబ్సిడీతో ఎస్సీలకు, 90 శాతం సబ్సిడీతో సన్నకారు, చిన్నకారు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లు అందజేశామన్నారు. రూ.17,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.