రైల్వే మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు

-పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు
టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కూడా కలిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించింది. వాటి అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మంత్రితో భేటీ అనంతరం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదని మంత్రి దృష్టికి తెచ్చామన్నారు.

TRS-MP's-met-Railway-Minister

పలు సందర్భాల్లో రైల్వే బోర్డును, రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశామని, వీటిపై వెంటనే దృష్టి పెట్టి సత్వరం పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని కోరామని తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలు జోనల్ హెడ్ క్వార్టర్లతో పాటు డివిజనల్ హెడ్ క్వార్టర్లను కూడి నిర్వహిస్తూ ఎక్కువ బాధ్యతలు వాటిపై పడ్డాయని, ఈ పరిస్థితుల్లో కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయడం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పై భారాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా రైళ్ళ ట్రాఫిక్‌ను నియంత్రించడం కూడా సులువవుతుందని చెప్పామన్నారు.

తెలంగాణలో రామగుండం, బెల్లంపల్లిలలో బొగ్గు లోడింగ్,కరీంనగర్‌లో గ్రానైట్ లోడింగ్, పండరిపురం, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లిలలో సిమెంట్ లోడింగ్, వరంగల్, కరీంనగర్‌లలో ఎరువుల లోడింగ్, ఖమ్మం, కాజీపేట, వరంగల్, కరీంనగర్‌లలో ఆహరధాన్యాల లోడింగ్ పనులు ఎక్కువగా జరుగుతున్నందువల్ల కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయడం వలన సికింద్రాబాద్ జోన్‌పై పని భారం తగ్గుతుందని వివరించారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రైల్వే బోర్డు అధికారులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆరు నెలల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, కానీ పూర్తి స్థాయిలో ఆశించిన పనులు జరగకుండా పెండింగ్‌లోనే ఉన్నదని కడియం శ్రీహరి వివరించారు. కొన్ని కారణాల రీత్యా అది పంజాబ్‌లోని కపుర్తలాకు తొలిసారి, రెండవసారి మహారాష్ట్రలోని రాంటెక్‌కు బదిలీ అయ్యాయని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా వివరించారని గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం 2012-13 ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయం తీసుకుందని, రెండేళ్ళు గడిచినా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఈ కర్మాగారం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కూడా సేకరించిందని, ఇప్పుడు పనులు ప్రారంభించినా వెంటనే స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి చెప్పామన్నారు.