రాజీ ప్రసక్తే లేదు

-ఎవరైనా హుందాగా ఉండాల్సిందే
-సభను ఎలా నడపాలో తెలుసు
-నిర్మాణాత్మక సూచనలకు స్వాగతం
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR addressing in Assembly

తెలంగాణ కొత్త రాష్ట్రం. అందరం కలిసి చక్కగా అభివృద్ధి చేసుకుని దేశంలోనే శభాష్ అనిపించుకునే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సెషన్ మొత్తాన్నీ డైవర్ట్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం రోజు కూడా వారి తీరు ఇదే.. అడ్డదిడ్డంగా నినాదాలు చేసుకుంటూ, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు. ఇప్పుడు రక్కస్ సృష్టించాలన్న ఉద్దేశంతో వారు వచ్చారు. అంతటి అసహనాన్ని భరించడం అవసరమా?

– శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని జాతీయస్థాయిలో చెడిపోనివ్వం. ఔన్నత్యాన్ని కాపాడతాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు. శాసనసభలో ఏ పక్షం అయినా పద్ధతిగా వ్యవహరించాల్సిందేనని స్పష్టంచేశారు. పనిగట్టుకుని సభను నడవనియ్యం అనే వాళ్లు ఉన్నారన్న సీఎం.. సభను ఎలా నిర్వహించుకోవాలో తమకు తెలుసని చెప్పారు. సభను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఇంకా కూడా అదే పద్ధతి కొనసాగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని టీడీపీ సభ్యులనుద్దేశించి హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం పునఃపరిశీలించాలన్న విపక్షాల సూచనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. ఒకటి రెండు రోజులు జరగనీయండి.. చూద్దాం అన్నారు.

తెలంగాణ కొత్త రాష్ట్రం అందరం కలిసి చక్కగా అభివృద్ధిచేసుకుని దేశంలోనే శభాష్ అనిపించుకునే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం చెప్పారు. నేను నలబై సంవత్సరాలుగా సభలో ఉన్నాను. బడ్జెట్ సెషన్ మొత్తాన్నీ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం రోజు కూడా పెడబొబ్బలు పెట్టుకుంటూ సభకు వచ్చారు. అడ్డదిడ్డంగా నినాదాలు చేసుకుంటూ, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు.

ఇప్పుడు అసంబద్ధమైన, అవసరంలేని రక్కస్ సృష్టించాలన్న ఉద్దేశంతో వారు వచ్చారు. అంతటి అసహనాన్ని భరించడం అవసరమా? ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని టీడీపీ సభ్యులనుద్దేశించి కేసీఆర్ చెప్పారు. బాధ్యత లేకుండా, దురుసుగా, అణచివేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోలేదని సీఎం స్పష్టం చేశారు. వారి ప్రవర్తన ఒకే విధానంతో ఉండడంవల్లే వారిపై చర్య తప్పలేదని వివరణ ఇచ్చారు. సభ సజావుగా జరగాలి. చర్చలు సమర్ధవంతంగా జరగాలి. మనం రాజ్యాంగ విధులు నెరవేర్చాలి అని సీఎం చెప్పారు.

ప్రతిరోజూ ఒక వాయిదా తీర్మానం ఇవ్వడం.. అది కూడా ముందే చేపట్టాలని పట్టుబట్టడం ఏమిటి అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా గవర్నర్‌పై కాగితపు ఉండలు విసిరారు. దానిని సభలో మనం(సభ్యులు), బయట ప్రజలు చూశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్ సమావేశాల వ్యవధిని పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నిరోజులైనా పెంచుతాం. విపక్షాలు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభావ్యవహారాల మంత్రి సెక్షన్లను చెప్పారు. ఇది స్వల్ప శిక్ష. పోడియం వద్దకు వచ్చి సభను జరగనీయం గాక, జరగనీయం అనే పద్ధతిని అనుసరించే సభ్యులున్నారు. ఎట్టిపరిస్థితులోనూ సభను జరిపి తీరుతాం. సభను జరగనీయవద్దని చూసే కొన్ని శక్తుల ప్రయత్నాలు సాగనిచ్చేదిలేదు అని కేసీఆర్ స్పష్టంచేశారు. అధికారపక్షం సభ్యులైనా సరే అభ్యంతకరంగా ప్రవర్తించి ఉంటే వాళ్లు కూడా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.