పుణ్యానికి ఇచ్చినట్లు కాంగ్రెస్ మాట్లాడుతోంది:కేసీఆర్

ఎన్నో బలిదానాలు, పోరాటాల తర్వాత తెలంగాణ వచ్చిందని, పుణ్యానికి ఇచ్చినట్లు కాంగ్రెస్ మాట్లాడుతోందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో డాక్టర్ సంజయ్‌తో పాటు పలు పార్టీల ముఖ్యనేతలు చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో…14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నం. సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలి. ఈ ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉంది. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే పునర్ నిర్మాణం సాధ్యం. మంచి నాయకత్వం, మంచి విజన్ ఉంటే దేశంలో నెంబర్ 1 స్టేట్‌గా తెలంగాణ ఎదుగుతది. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజలకు ఏం కావాలో టీఆర్‌ఎస్‌కు తెలుసు. ఉద్యమం ప్రారంభించిన నాడు నన్ను ఎంతో ఎగతాళి చేసిండ్రు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలు అద్భుతమైన సహకారం అందించిండ్రు.

ఒక్క కాంగ్రెస్ నేతైనా ఉద్యమం చేసిన్రా : కేసీఆర్
టీ కాంగ్రెస్ నేతలు ఒక్కరైనా ఉద్యమం చేసిన్రా? తెలంగాణ వట్టిగానే రాలే ఎన్నో పోరాటాల తర్వాత వచ్చింది. ఇప్పుడేమో లేసినోడు.. లేవనోడూ తెలంగాణ గురించి మాట్లాడుతుండ్రు. రాజశేఖర్ రెడ్డి ఉన్ననాడు ఆయన పంచన చేరి పదవులు పట్టుకుని వేలాడిన్రు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో కుట్రలు చేసిన్రు. సమైక్య పాలకుల పుణ్యమాని చీకట్లో మగ్గినం. ఆంధ్రాలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులన్నింటికీ సంతకం పెట్టింది పొన్నాల కదా? వైఎస్ వెనకాల ఉండి ఉద్యమాన్ని వెక్కిరించలేదా? కిరణ్‌కుమార్ ఒక్క రూపాయి ఇవ్వనంటే.. ఒక్క మాట మాట్లాడలేదు. ఆనాడు తెలంగాణ మంత్రులు పదవులు పట్టుకుని ఉయ్యాలలూగిన్రు. తెలంగాణ నీళ్లను దోచుకుపోతున్న సీమాంధ్ర నేతలకు డీకే అరుణ మంగళహారతులు పట్టింది.
బడుగు బలహీనవర్గాల పక్షాన ఉంటాం : కేసీఆర్
బడుగు, బలహీన వర్గాల పక్షాన టీఆర్‌ఎస్ ఉంటుందని, ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. నిరుపేదలకు రెండు బెడ్‌రూంల ఇండ్లను కట్టిస్తం.గృహ నిర్మాణానికి సంవత్సరానికి రూ. 3 వేల కోట్లు ఖర్చు అవుతున్నది. రైతులకు రెండేళ్ల తర్వాత 24 గంటల కరెంట్ అందిస్తం. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతది.

చారిత్రక సంపదను రక్షించుకుంటాం : కేసీఆర్
మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని హైదరాబాద్ చారిత్రక సంపదను నాశనం చేయుటకు ప్రయత్నిస్తున్నారు. చారిత్రక సంపదను రక్షించుకుంటాం. సుల్తాన్ బజార్, మొజాంజాహీమార్కెట్, అసెంబ్లీ బిల్డింగ్‌ను మాయం చేసే కుట్ర చేస్తున్నారు. తెలంగాణ భాష, సంస్కతి మీద దాడి జరిగింది. అన్ని రకాలుగా నష్టపోయిన మనం తెలంగాణ పునర్‌నిర్మాణంలో బంగారు తెలంగాణను సాధించుకుందాం అని చెప్పారు.