పునరుద్ధరణతో జలకళ

– ఉధృతంగా కొనసాగుతున్న మిషన్‌కాకతీయ పనులు
– పోటాపోటీగా పూడికను పొలాలకు తరలిస్తున్న రైతులు

Mission kakaitya 001

హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పూర్తయితే పల్లెలు జలకళ సంతరించుకుంటాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సాగునీరులేక పంటలు ఎండి దిగుబడి రాక,అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఇకపై రెండు పంటలు పండిస్తారని ధీమా వ్యక్తంచేశారు. రైతులు బాగుపడాలంటే చెరువులు బాగుండాలని సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరణ పనులు ఉద్యమంలా కొనసాగాయి. పూడికను పొలాలకు తరలించేందుకు రైతులు పోటీపడ్డారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలో చెరువుల పునరుద్ధరణ పనులను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. నెక్కొండ మండలం గుండ్రపల్లి ఊర చెరువులో పనులను టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి, కథలాపూర్, మేడిపల్లిలో పూడికతీత పనులను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రారంభించారు.

నల్లగొండ జిల్లా తుక్కాపురం, వలిగొండ మండలంలో రెడ్లపాక, మొగిలిపాక గ్రామాల్లో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పనులను ప్రారంభించారు. అర్వపల్లి మండలంలో కాసర్లపహాడ్, కోడూరు ఊర చెరువులను, నూతన్‌కల్ చెరువు పనులను ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. నార్కట్‌పల్లి మండలంలో తొండ్లాయి, తిరుమలగిరి, మాండ్ర గ్రామాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం, నారాయణపురం మండలంలోని పుట్టపాక, చిల్లాపురం, వాయిళ్లపల్లిల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పనులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ పరిధిలోని శెరిగూడ గోధుమకుంట చెరువులో ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ పూడిక తీత పసులను ప్రారంభించారు. మండల మహిళా సమూఖ్య సభ్యులు శ్రమదానం చేశారు.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలో రామేశ్వర్‌పల్లి, అడ్లూర్, ఇస్రోజివాడి, గుడేం, తిమ్మక్‌పల్లి, నర్సన్నపల్లి చెరువుల పనులను విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఎల్లారెడ్డి మండలంలోని జాన్కంపల్లి, భిక్కనూరు, కళ్యాణి, వెంకటాపూర్, అచ్చయ్యపల్లి, గోలిలింగాల, వదలపర్తిలో ఊర చెరువుల పనులను ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలం ఇనాయత్‌నగర్‌లోని కొత్త చెరువు పనులను టీఆర్‌ఎస్ రైతువిభాగం అధ్యక్షుడు వేముల సురేందర్ రెడ్డి ప్రారంభించారు.