పునరుద్ధరణతో రెండు పంటలు

-మిషన్ పూర్తయితే పల్లెలు సస్యశ్యామలం.. పనుల ప్రారంభంలో ప్రజాప్రతినిధులు
చెరువులతోనే పల్లెల అభివృద్థి సాధ్యమవుతుంది. పునురుద్ధరణ పూర్తయితే ఏటా రెండు పం టలు పండుతాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టారుఅని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఎండలు మండుతున్నా 99 చెరువుల పనులను కొత్తగా ప్రారంభించారు. గ్రామానికి మేలు చేసే చెరువుల పునరుద్ధరణలో పాల్గొనేందుకు ఎండలను సైతం జనం లెక్కచేయలేదు.

Mission Kakatiya 03

సమైక్యపాలనలో చెరువులు ధ్వంసం: ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం అంబవాయి చెరువు పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలన్నింటిని పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. నేరడిగొండ మండలం కుంటాల సమీపంలోని పిప్పల్‌కుంట చెరువు పునరుద్ధరణ పనుల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లిలోని విరమోనికుంట పూడికతీత పనులను ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి చెరువుకు పాలమూరు ఎత్తిపోతల నుంచి నీరు తీసుకొస్తామన్నారు. సీమాంధ్రపాలనలో చెరువులను మరమ్మతులు చేయకపోవడంతో పూడిక పెరిగి ఆయకట్టు తగ్గిందన్నారు. పల్లెలు సస్యశ్యామలంగా ఉండేందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతో మిషన్ కాకతీయను ప్రవేశపెట్టారన్నారు.

నల్లగొండటౌన్ జిల్లా చౌటుప్పల్, చండూరు మండలాల్లో పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లలో నిర్మిస్తున్న గంగదేవి చెరువు ఎత్తిపోతల సంపు నిర్మాణ పనులను ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్, టీఆర్‌ఎస్ నల్లగొండ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి పరిశీలించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఘనపూర్, సోమారం, ఎగ్లాస్‌పూర్, జాగీర్‌పల్లి, ఎలబోతారంలో పనులను ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు ప్రారంభించారు.

Mission Kakatiya 01

హన్మకొండ మండలం నర్సింహులగూడెంలో నేలకుంట పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో శెట్‌పల్లి, పర్మళ్ల, కార్పోల్, నాగారం, పోల్కంపేట్, ఒంటర్‌పల్లి, ముస్తాపూర్, బూరిగిద్దలో ఊర చెరువు పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ పెద్ద చెరువులో పూడికతీత పనులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.

-జంగరాయి జంగల్ చెరువుకు పూర్వవైభవం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జంగరాయి జంగల్ చెరువులో పూడికతీత పనులు వారం రోజుల నుంచి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు మూడు వేల ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని రైతలు పొలాలకు తరలించుకున్నారు. 30 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువుకు ప్రభుత్వం రూ.20.12 లక్షలు మంజూరు చేసింది. కట్ట, తూము, అలుగు, కట్టుకాల్వ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. చెరువు మట్టితో రైతులు సుమారు ఎనిమిది పాత వ్యవసాయ బావులను పూడ్చుకున్నారు. రెండు, మూడు రోజుల్లో చెరువు పునరుద్ధరణ పనులు పూర్తికానున్నాయి.