పునర్నిర్మాణంలోనూ కళాకారులుండాలి

-అదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం: హరీశ్‌రావు
-కళాకారులకు పెద్దపీట వేసిన కేసీఆర్: రసమయి
-తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

Harish Rao appaluads Rasamai Balakishan

తెలంగాణ పునర్నిర్మాణంలో కళాకారులకు ప్రత్యేకపాత్ర ఉండాలన్నదే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, అందుకే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కళాకారుడికే ఇచ్చారని సాగునీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కావూరి హిల్స్‌లోని ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం మానకొండూరు ఎమ్మెల్యే, ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నప్పటి నుంచి రసమయి ఆయన వెంట ఉన్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో భాగస్వామియై ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకిషన్‌ను తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమస్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకే సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమించారన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవి, పెట్టనివి కూడా ప్రజల ఇబ్బందులకు గుర్తించి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయను ప్రజల్లోకి తీసుకెళ్లి రైతాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత కళాకారులపైనే ఉందని, కళాకారులు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రసమయి వచ్చిన తరువాత బహిరంగ సభల తీరు మారిందని, దేశపతి శ్రీనివాస్, అల్లం నారాయణ మాటలు ప్రజలను చైతన్యవంతం చేశాయని అన్నారు.

రసమయి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌ను మంత్రి ఈటల రాజేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు హరీశ్‌రావు, ఈటల కలిసి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈటల రాజేందర్ చేతులమీదుగా ఫైలును తీసుకొని సంతకం చేయడం ద్వారా రసమయి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రసమయి మాట్లాడుతూ, ప్రతి కళాకారుడి చెమట ముద్దే ఈ రసమయి బాలకిషన్ అని అన్నారు. కళాకారులకు పాటే అర్హత అని, విద్యార్హతలు లేకున్నా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ లు బాల్క సుమన్, కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతిశ్రీనివాస్, గాయకులు జయరాజ్, మిట్టపల్లి సురేందర్, యశ్‌పాల్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.