పునర్జీవ పథకానికి జనామోదం

-పోచంపాడ్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు, ప్రజలు
-సభ విజయవంతం.. గులాబీ శ్రేణుల్లో జోష్
-నేతలను అభినందించిన సీఎం కేసీఆర్
-టీఆర్‌ఎస్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన జనం

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పథకానికి జనామోదం లభించింది. సమైక్యపాలకుల నిర్లక్ష్యం, ఎగువ రాష్ట్రం కుట్రలతో ఒట్టిపోయిన ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న పునర్జీవ పథకానికి ప్రజలు మద్దతు పలికారు. పునర్జీవ పథకం శంకుస్థాపన క్రతువులో తాము సైతం ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షతో లక్షల మంది రైతులు తరలివచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తుండగా చప్పట్లుకొట్లి, జై తెలంగాణ నినాదాలు చేసి భగీరథ ప్రయత్నానికి మద్దతుపలికారు. అనంతరం నిర్వహించిన ఎస్సారెస్పీ పునర్జీవ సభకు భారీగా జనం హాజరయ్యారు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రక సందర్భంలో తాము సైతం మద్దతుగా ఉంటామంటూ ప్రజలు తరలివచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి స్వచ్ఛందంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. వరంగల్ వంటి దూరప్రాంతాల నుంచి సైతం ఆరుగంటలకుపైగా ప్రయాణం చేసి సభకు చేరుకున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను ప్రత్యేకంగా అలంకరించుకొని వచ్చారు. ఏడాదిలోగా ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ ప్రక్రియ పూర్తిచేసి జలకళ తీసుకొస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన రైతుల్లో భరోసా నింపింది. శివాలయంలా ఉన్న ఎస్సారెస్పీని నీటితో నింపి వైష్ణవాలయంలా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలను స్వాగతిస్తూ ప్రజలు, రైతులు ఈలలు వేసి, చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. ప్రసంగాన్ని ఆసాంతం ఓపికగా విన్నారు. సభకు తరలివచ్చిన జనహోరును చూస్తే, సీఎం కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టమవుతున్నది

అంచనాలకు మించి జనం హాజరు
సభకు ఉహించిన దానికంటే భారీగా రైతులు, ప్రజలు తరలిరావడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సభను విజయవంతం చేయడంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఉత్తరతెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారు. సభకు తరలివచ్చేలా రైతులను చైతన్యపరుచడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సభ విజయవంతం కావడంపై పార్టీ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించినట్టుగా సమాచారం. పునర్జీవ సభతో రైతాంగంలో ఆత్మవిశ్వాసం నింపగలిగామని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పటికే రుణమాఫీ జరిగిందని, వచ్చే యాసంగి నుంచి రైతులకు 24 గంటల కరెంటు సరఫరాతోపాటు సాగునీరు అందిస్తే రైతులకు భరోసా కలుగుతుందని చెప్తున్నారు.

సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో నమ్మకం
సభకు హాజరైన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన యువరైతు చెందిన నర్సారెడ్డిని నమస్తే తెలంగాణ పలుకరించగా.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన చేసింది కండ్లకు కనపడుతున్నది. ఇప్పుడు పోచంపాడ్ ప్రాజెక్టులో ఏడాదిలో నిండుగా నీళ్లు చూస్తాం. మా పొలాలకు కాల్వల నుంచి నీళ్లు వస్తాయన్న నమ్మకం ఉన్నదిఅని చెప్పిండు. వేములవాడ ప్రాంతం నుంచి వచ్చిన చాకలి ఆశాలు కూడా ఇదే మాటచెప్పిండు. ఇబ్రహీంపట్నంకు చెందిన మహిళా రైతు నర్సవ్వ మాట్లాడుతూ తన భర్త ఇకపై దుబాయ్‌కి పోవాల్సిన అవసరం పడదన్నది. వచ్చేఏడాది నుంచి ఊర్లనే ఉంటూ పంట పండించుకుంటామని సంబురంగా చెప్పింది. ఇలా అనేక మంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమ నమ్మకాన్ని వెలిబుచ్చారు.

సభ సైడ్‌లైట్స్
-సీఎం సభకు ఉదయం నుంచి సాయంత్రం వరకు జన ప్రవాహం కొనసాగింది.
-గంగపుత్రులు వలగొడుగులు, డప్పులతో, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండులు డోలక్‌లు వాయిస్తూ సభకు వచ్చారు.
-నిజామాబాద్ జిల్లాకు చెందిన తమ్మల్ల వాయిద్యకారులు తమ వాయిద్యాలతో సభాస్థలిని ఆకర్షించారు.
-సభ ముగిసిన రెండుగంటల వరకు ట్రాఫిక్ క్లియర్ కాలేదు
-ఉదయం 10 గంటలకే 44వ జాతీయరహదారిపై రెండువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలలిచిపోయాయి.
-సభ వద్దకు హనుమాన్ దీక్షాపరులు సైతం తరలివచ్చారు
-టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభికులకు ప్రత్యేకంగా వాటర్‌ప్యాకెట్లు అందజేశారు.
-ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభాస్థలిలోని జనం పేపర్లు, టవల్స్, తలపై కప్పుకున్నారు. మహిళలు చీర కొంగులను కప్పుకుని సీఎం ఉపన్యాసం ముగిసే వరకు వేచి ఉన్నారు.
-పునరుజ్జీవ సభకు వచ్చిన జనంతో శ్రీరాంసాగర్ ప్రధానడ్యాం సాయంత్రం వరకు కిక్కిరిసిపోయింది.
-కాళేశ్వరం నుంచి తెచ్చిన గోదావరి జలాలతో కూడిన కలశాన్ని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పోచంపాడ్‌కు తీసుకువచ్చారు. ఈ నీటిని ఎస్సారెస్పీలో కలిపారు.
-వేములవాడ నుంచి వడ్లు, మట్టిని అక్కడి రైతులు తీసుకువచ్చి ప్రాజెక్టు నీటిలో వదిలారు.
– టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి సభా స్ధలికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎదురేగి పాదాభివందనం చేశారు.
-సభలో పలువులు మహిళలు నవ్వులు చిందించారు. మరికొందరు నృత్యాలు చేశారు.
-రసమయి బాలకిషన్ తన మాటల చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు.

ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశామలమవుతుందని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ రివర్స్ పంపింగ్‌తో రైతాంగానికి భరోసా కలుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీతో వట్టిపోయిన ఎస్సారెస్పీకి పునర్జీవ పథకంతో ప్రాణం వస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో రాష్ట్ర రైతాంగం కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చిన పథకమే ఇదన్నారు.

బృహత్తర పునర్జీవ పథకం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఓ బృహత్తర కార్యక్రమమని, మనమంతా ఎంతో అదృష్టవంతులమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. గోదావరి జలాలను రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. నిర్మల్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. చరిత్రలో ఎవరూ తీసుకోని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజలకు కృతజ్ఞతలు వేముల ప్రశాంత్‌రెడ్డి
పునర్జీవ సభకు లక్షల్లో తరలివచ్చిన ప్రజలకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నాయకుల నిర్వాకంతో వట్టిపోయిన ఎస్సారెస్పీకి పునర్జీవ పథకంతో సీఎం కేసీఆర్ ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. దీనిద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల రైతాంగానికి భరోసా కల్గించామని చెప్పారు. వివిధ జిల్లాలనుంచి, బాల్కొండ నియోజకవర్గంనుంచి తరలివచ్చిన అశేష జనవాహినికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పునర్జీవ పైలాన్ ఆవిష్కరించిన సీఎం
వరద కాల్వ జీరో పాయింట్ వద్ద నిర్మించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పైలాన్‌ను ఉదయం 11.40 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. రూ.1050 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి భూమిపూజ అనంతరం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి పోచంపాడ్ గెస్ట్‌హౌస్‌కు మధ్యాహ్నం 12.10 గంటలకు సీఎం చేరుకున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు సభాస్థలికి చేరుకుని 2.30 గంటలకు ప్రసంగం ప్రారంభించి 20 నిమిషాలపాటు మాట్లాడారు. మధ్యాహ్నం 3.05 నిమిషాలకు మంత్రి హరీశ్‌రావు, టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్ తదితరులు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరివెళ్లారు.