ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు

వైద్యులు కష్టపడి పనిచేస్తే ప్రైవేటు కన్నా ప్రభుత్వ వైద్యశాలలే మిన్నగా ఉంటాయన్న పరిస్థితి రాష్ట్రంలో కల్పించవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరిచే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు త్వరలోనే రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీలాంటి దవాఖానాల వరకు అన్నింటిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు.

KCR-01

-తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్రస్థాయి సదస్సు
– వైద్యుల సంఘం నేతలతో సీఎం కేసీఆర్
-వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇండ్ల నిర్మాణం
-మరో సర్వే ఉండదని స్పష్టమైన సంకేతాలు
-జలహారంపై ప్రతివారం సమీక్ష నిర్వహించండి
-సమీక్షల్లో సీఎం కేసీఆర్ ఆదేశం
మొదట తనను కలిసిన వైద్యుల సంఘం నేతలతో మాట్లాడిన ఆయన.. అనంతరం ఇండ్ల నిర్మాణం, జలహారం, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రాంసింగ్, నాయకులు నాగేందర్, లింగంగౌడ్, జూపల్లి రాజేందర్, శ్రీధర్‌రెడ్డి, ఎర్రగడ్డ చెస్ట్ వైద్యశాలశాఖ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ తదితరులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందుకు ప్రభుత్వ వైద్యులు సహకరించాలని కోరారు.

ప్రభుత్వ చొరవ పట్ల కృతజ్ఞతలు తెలిపిన వైద్యుల సంఘం నేతలు.. వైద్యశాఖలో ఖాళీల భర్తీతోపాటు ఇతర అంశాలపై సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన సమస్యలు, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయడానికి వైద్యారోగ్యశాఖకు విస్తృతమైన యంత్రాంగం ఉందని చెప్పారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగర, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారితో పోలిస్తే తక్కువ హెచ్‌ఆర్‌ఏ వస్తున్నదని, దీంతోపాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వపరంగా చేసే ప్రయత్నాలతోపాటు ప్రభుత్వ వైద్యుల సహకారం, చిత్తశుద్ధి కూడా అవసరమని ఆయన స్పష్టంచేశారు.

నగరంలోని ఛాతీ వైద్యశాలను వికారాబాద్ ప్రాంతానికి తరలించే విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు ముఖ్యమంత్రికి హామీఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వైద్యశాల నగరం మధ్యలో ఉండటం వల్ల రోగులకు ప్రశాంతమైన వాతావరణం కరువైందని, కాలుష్యం వల్ల క్షయ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారనే ప్రభుత్వ అభిప్రాయంతో వారు ఏకీభవించారు.