ప్రైవేట్ ప్రాక్టీసే ముద్దనుకుంటే…స్వచ్ఛందంగా వెళ్లండి

-రెండు గుర్రాల స్వారీ సరికాదు…
-పేదల సంక్షేమానికి లక్షలు ఖర్చు చేస్తున్నాం..
-వైద్యులు సక్రమంగా పనిచేస్తేనే సర్కారు లక్ష్యం నెరవేతుంది
-సమయంతో పనిలేదు… 24 గంటలూ సేవ చేయాలి
-విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షనే…
-అంకితభావంతో పనిచేసి ప్రజల హృదయాలు గెలుచుకోవాలి
-నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

Harish Rao made a inspection in Siddipet govt hospital

వైద్యులు గుండెల మీద చేయ్యేసుకుని చెప్పండి… 24 గంటలు సర్వీసు చేస్తున్నారా..? ఒకవేళ మీకు ప్రైవేట్ ప్రాక్టీసే ముద్దనుకుంటే ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రాక్టీస్ చేసుకోండి… అంతేగానీ రెండు గుర్రాల స్వారీ చేయడం సరికాదు.. అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కంగారు మెథడ్ కేర్ యూనిట్ (నవజాత శిశు సంరక్షణ కేంద్రం)ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్యులు 24 గంటలు పనిచేస్తూనే ఉండాలన్నారు. వీరికి సమయంతో పనిలేదన్నారు. వైద్యులు అంకింతభావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమన్నారు. ప్రతి పది రోజులకొకసారి తాను దవాఖానాను సందర్శిస్తానని… మంచి సేవలు అందించి వైద్యులు ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్నారు. అనంతరం దవాఖానాలోని ప్రతి వార్డును పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు.

ఈ ప్రభుత్వం పేద వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతి వైద్యులు ప్రజలకు సేవలందిస్తూ ఒక కమిట్‌మెంట్‌తో పనిచేయాలని సూచించారు. ప్రతిరోజు ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌తో పాటు ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు విధి నిర్వహణలో ఉండాలన్నారు. డ్యూటీలో ఉండి ఇంటి దగ్గరే ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని వారు ఎంతటి వారైనా సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమన్నారు. వైద్యుల పైన మాకు ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్యులు 24గంటల సర్వీసు చేస్తూనే ఉండాలన్నారు. మనకు సమయమనేడిది ఉండదన్నారు. ప్రజాసేవే మన లక్ష్యమంటూ ముందుకెళ్లాలని వైద్యులకు సూచించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా కంగారు మెథడ్ కేర్ యూనిట్ (నవజాత శిశు సంరక్షణ కేంద్రం)ను ప్రారంభించి ప్రతి బ్లాక్‌ను పరిశీలించారు. వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి శంకుస్థాపన చేయడంతో పాటు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు న్యూ లారీ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిది నవజాత శివు సంరక్షణను మన సిద్దిపేటలో ప్రారంభించుకున్నామన్నారు. దేశంలో ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో కేవలం 8పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. మన సిద్దిపేటలో ప్రారంభించిన శిశు సంరక్షణ కేంద్రంలో 12పడకలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెరుగైన వైద్యం కోసం శిశువులను హైదరాబాద్‌కు రెఫర్ చేసే వారని ఇప్పుడు అలాంటి సమస్య ఉండబోదన్నారు. ఏ శిశువుకైనా ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ప్రజలంతా కార్పొరేట్ దవాఖానలవైపు కాకుండా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలను పొందాలని సూచించారు. ఈ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నెలలు నిండని శిశువుకు మెరుగైన వైద్యం అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హైరిస్క్ కేంద్రం ద్వారా గర్భిణులు ప్రసవ సమయంలో ఎదుర్కొనే రక్తహీనత తదితర సమస్యలకు వైద్యులు చికిత్స చేస్తారన్నారు. సిద్దిపేటలో 50పడకల దవాఖానగా ఉన్న మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని వంద పడకల దవాఖానగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

4కోట్ల రూపాయలతో అదనంగా 50పడకల దవాఖానగా నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ మొత్తం 60బెడ్స్‌కు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. ఎంసీహెచ్‌లో ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఫిర్యాదు బాక్స్‌లు ఇప్పినప్పుడు ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో 90శాతం పిల్లలకు సంబంధించినవే అన్నారు. అందుకోసం వైద్యులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు.

Harish Rao made a inspection in Siddipet govt hospital01

నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన అనంతరం దవాఖానలోని ప్రతి వార్డును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా.. సరిగా వైద్యం అందిస్తున్నారా.. ఎవరైన వైద్యులు కానీ.. స్టాఫ్ నర్సులు కానీ దురుసుగా మాట్లాడుతున్నారా.. అని చికిత్స పొందుతున్న వారిని అడిగారు. ఎవరు డబ్బులు తీసుకోవడం లేదని సేవలు బాగానే అందిస్తున్నారని చెప్పారు. ప్రతి పది రోజులకొకసారి నేను దవాఖానని సందర్శిస్తాను.. మంచి సేవలు అందించి ప్రజల హృదయాలు గెలుచుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ యూనిసేఫ్ చీఫ్ ఆపరేటీవ్ ఆఫీసర్ రూత్‌లియానో, హెల్త్ కన్సల్‌డెంట్ డాక్టర్ సంజీవ్, ట్రైనింగ్ కో ఆర్డినేటర్ నీలిమాసింగ్, నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఆలుమేలు, వైద్యులు లకా్ష్మరెడ్డి, సురేంద్రబాబు, రఘురాంరెడ్డి, కాశీనాథ్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పూజల వెంకటేశ్వర్‌రావు, రాధకృష్ణశర్మ, కలకుంట్ల శేషుకుమార్, కొర్తివాడ రామన్న తదితరులున్నారు.

ప్రతి స్టాఫ్ నర్సులో సేవ, ఓపిక, మంచితనం ఉండాలని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేయనున్న 14స్టాఫ్ నర్సులను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైద్యం కోసం వచ్చే వారిని చిరునవ్వుతో వారిని పలకరించి వాళ్ల యోగాక్షేమాలను తెలుసుకుని అందుకనుగుణంగా వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సేవాభావంతోనే మంచి పేరు వస్తుందన్నారు. మన మంచితనమే మనకు శ్రీరామరక్ష అన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి 14మంది స్టాఫ్ నర్సులు, నలుగురు ఎంబీబీఎస్ వైద్యులు, ముగ్గురు చిల్డ్రన్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారని తెలిపారు. ఈ స్టాఫ్ నర్సులకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో 20రోజుల పాటు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు.