ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు

-దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
-ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం కడియం
-టీఆర్‌ఎస్‌కే ఓట్లడిగే హక్కు: మంత్రి పోచారం
-సంక్షేమంలో దేశానికే రాష్ట్రం ఆదర్శం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
-ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా: దయాకర్
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తుంటే, ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి.. ఉప ఎన్నికలో ఓట్లతో వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు.

Pasunuri Dayakar election campaign in Parakl constituency

వరంగల్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని కోరుతూ గురువారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరకాల మండలంలో డిప్యూటీ సీఎం కడియం, చిట్యాల మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లింగాలఘనపురంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. పరకాల మండలం వెల్లంపల్లిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అభ్యర్థి పసునూరి దయాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిందని, పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరక్క స్థానికేతరులకు టికెట్ ఇచ్చాయని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఉద్యమంలో తొలినుంచి ఉన్న మారుమూల గ్రామానికి చెందిన పసునూరి దయాకర్‌కు టికెట్ ఇచ్చారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థి దయాకర్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపించాలని, ప్రజలు ఆకాంక్షమేరకు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సాధారణ చిత్రకారుడినైన తనను సీఎం కేసీఆర్ ప్రోత్సహించి ఉద్యమంలో మమేకం చేశారని, ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తనను గెలిపించి విపక్షాలకు ఈ ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలని కోరారు.

బంగాళాఖాతంలోకి కాంగ్రెస్: మంత్రి పోచారం
ఓట్లు వేయకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామన్న కాంగ్రెస్‌ను ఈ ప్రాంత ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. చిట్యాల మండలం నవాబుపేట, సుబ్బక్కపల్లి, అంకుషాపూర్, టేకుమట్ల గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. టేకుమట్లలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ 99 శాతం నెరవేర్చామన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను గెలుపు ఖాయమన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పథకాలను దేశం శ్లాఘిస్తున్నది: మంత్రి అల్లోల
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని శ్లాఘిస్తున్నాయని గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. లింగాలఘనపురంలో చిట్ల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పథకంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెంచి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.

వాటర్‌గ్రిడ్‌పై అధ్యయనానికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్రం నుంచి అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించారన్నారు. బీహార్‌లోనూ మన పథకాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇదంతా సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే జరుగుతున్నదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సామాన్యుడికి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రతిపక్షాల కండ్లు బైర్లుకమ్మేలా చేశారని, బీజేపీకి అభ్యర్థి లేక అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, కాంగ్రెస్ హైదరాబాద్ నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపిందని ఎద్దేవాచేశారు. ఈ ఎన్నికల్లో దయాకర్‌ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలో ప్రజలందరినీ పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలని, అవసరమైతే వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి కార్యకర్తలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, జెడ్పీటీసీలు రంజిత్‌రెడ్డి, స్వామినాయక్, డాక్టరు సుగుణాకర్‌రాజు, నాయకులు సేవెల్లి సంపత్, నెల్లుట్ల రవీందర్‌రావు, ఏదునూరి వీరన్న, అంజయ్య, నాగేందర్, నాగరాజు, వెంకటమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.