ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ

-దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ప్రతి దళితునికి మూడెకరాల సాగుభూమి
– 15న పట్టాల పంపిణీ: మంత్రి హరీశ్‌రావు

Harish Rao
తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం ఎప్పుడూ,ఎక్కడా ప్రవేశపెట్టని పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలు కూలీలుగా మిగిలిపో వద్దని, రైతులుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొని భూ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

మొదటి విడతగా అర్హులైన భూమిలేని దళితులకు, రెండో విడతలో ఎస్టీలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. సాగుకు యోగ్యమైన భూమిని కొనుగోలు చేసి ఇస్తుందన్నారు. పొలానికి అవసరమయ్యే విద్యుత్ కనెక్షన్, ఎనర్జీ చార్జీలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను సైతం ఉచితంగా అందిస్తూ మొదటి ఏడాది పూర్తిస్థాయి పెట్టుబడిని ఉచితంగా అందిస్తుందని వివరించారు. రైతు చేతికి ఆదాయం వచ్చేవరకు ఉచితంగా కూలీ డబ్బులు సైతం అందిస్తుందని తెలిపారు. గ్రామంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు నివేదిక అందించాలని సూచించారు. ప్రతి దళితునికి మూడెకరాల సాగుభూమి అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు.

ఆ దిశగా ఎంత భూమినైన కొనుగోలు చేసి పంచి పెడుతుందన్నారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని ఏ గ్రామంలో పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తవుతుందో ఆ గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూ పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు అమ్మేవారి వివరాలు సేకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. భూ పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలను శాశ్వతంగా కూలీలుగానే పరిమితం కాకుండా వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.