ప్రతిపక్షాలకు పచ్చకామెర్లు

ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేస్తున్నది. హాస్టళ్లకు సన్నబియ్యం, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పు న రేషన్ బియ్యం, చెరువుల పునరుద్ధరణ, పింఛన్ల పంపిణీ అన్ని బాగున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు విమర్శించేందుకు అంశమే లేదు. అధికార పక్షంపై ఏదో ఓ విమర్శ చేయాలనే ఉద్దేశంతో, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నది. శిక్షణ శిబిరానికి ప్రతి రూపాయి పార్టీ నిధుల నుంచి ఖర్చుపెట్టాం. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలున్నాయి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.

Harish Rao Press Meet
-ప్రజా సంక్షేమంపై శిక్షణ పొందినా విమర్శలేనా?
-ప్రతి రూపాయి పార్టీ నిధుల నుంచే చెల్లించాం
-మిషన్ కాకతీయపై అరోపణలు అర్థరహితం
-విమర్శలను పట్టించుకోం: మంత్రి హరీశ్‌రావు
మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో, నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో లోటుపాట్లను సమీక్షించుకోవాలి. మెరుగైన విద్యుత్ సరఫరా, పట్టణ, గ్రామీణాభివృద్ధి, ఇంటింటికీ తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, పథకాల ఫలితాలు ప్రజలకు ఎలా అందించాలనే మార్గాలు తెలుసుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నించడం తప్పవుతుందా? అధికారంలో ఉండగా ఇలాంటి శిక్షణ తరగతులు ఎందుకు పెట్టుకోలేదని సిగ్గుపడాల్సింది పోయి విమర్శిస్తారా? రామా.. అన్నా కొందరికి బూతులా వినిపిస్తున్నదని మండిపడ్డారు.

పరిపాలనపై మంచి అనుభవం ఉన్న ఆస్కీ సంస్థకు శిక్షణ తరగతులు నిర్వహించే బాధ్యత అప్పగించామని, ఇప్పటికే రూ.5 లక్ష లు చెల్లించామని చెప్పారు. ఇంకా బాకీ ఉంటే అది కూడా చెల్లిస్తామన్నారు. ప్రతిపక్ష నేతలు కొందరు మిషన్‌కాకతీయలో పాల్గొంటూ మంచి కార్యక్రమమమంటూనే, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లలో విమర్శస్తున్నారని చురకలంటించారు. కమీషన్ల కాకతీయగా మారిందని పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఈ టెండర్లు పిలిచామన్నారు. ఇప్పటి వరకు ఒక్క చెరువుకు బిల్లులు చెల్లించలేదని, కమీషన్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అవాస్తవాలను సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌లు పాల్గొన్నారు.